మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు వరద పాలయ్యాయి. అత్యధికం గా నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో పం టనష్టం భారీగా జరిగింది. చేతికి వచ్చిన పంటలు వరద పాలు కావడంతో అన్నదాతలు ఆందోళన కు గురవుతున్నారు. అకాల వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి.. కాల్వలు తెగిపోయి, చెరువులకు గండ్లు పడి పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొ త్తం 14,783 ఎకరాలు పంటలు నీట మునిగిన ట్లు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ మేరకు సర్కారుకు పంటనష్టం వివరాలను పంపించారు. అయితే స ర్కారు సాయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. కే వలం వరద బాధితులకు మాత్రమే సాయం అం దిస్తామని ప్రకటించినా.. పంటలు వరద పాలైన రైతులకు ఆదుకునే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మ డి జిల్లాలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది.
మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూ ల్ జిల్లాలో ఒకేరోజు 12నుంచి 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏకంగా చెరువులు ఉప్పొంగి వట్టెం పంప్‌హౌస్‌లోకి నీళ్లు చేరి భారీ నష్టం సంభవించింది. అదేవిధంగా చేతి కి వచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న ఇతర వర్షాధార పంటలన్నీ నీటి పాలయ్యాయి. అనేకచోట్ల రహదారులు తెగిపోయాయి.. కల్వర్టులు.. వంతెనల పై నుంచి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు స్తం భించాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జి ల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇంత పె ద్ద ఎత్తున భారీ నష్టం సంభవించినా సర్కారు ఇప్పటివరకు స్పందించకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అరకొరగా కొంతమందికి సాయం అందించి చేతులు దులుపుకొన్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వ రద పాలైన పంటలకు ఎకరాకు రూ.25వేల చొ ప్పున నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో వారం రోజులు ఎడతెరిపి లే కుండా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చాలా చోట్ల పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. అంచనాలకు అందని విధం గా తీవ్ర నష్టం జరిగింది. కృష్ణ పరీవాహక ప్రాం తాలు ఉన్న నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లా లో పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది.
నారాయణపేట జిల్లాలో 11మండలాల్లో 5200ఎకరాల్లో వరి, పత్తి, కందులు, రాగులు, జొన్నలు, పొద్దు తిరుగుడుతోపాటు ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఇక నాగర్‌కర్నూల్ జిల్లాలో 4,162 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్లు అధికారులు తేల్చారు. 2,173మంది రైతుల పంటలు నష్టపోయాయని పత్తి, వరికి అధికనష్టం జరిగిందని అంచనా వేశారు. 2,895 ఎకరాల్లో వరి, 957ఎకరాల్లో పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలు నీట మునిగాయి.
ఇక వనపర్తి జిల్లాలో 2,411 ఎకరాల పంట దెబ్బతిందని అధికారిక లెక్కలు చెబుతున్నారు. దీనిలో 85% వరి ఉంటే.. మిగిలిన 15%లో కంది, మొక్కజొన్న, మినుములు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 1294 ఎకరాల్లో వరి, పత్తి, కందులు, జొన్న ఇతర పంటలు వరద పాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1716 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పత్తి 597, వరి 217, కంది 552, మిర్చి 238, పొగాకు 36, బొప్పాయి ఐదు ఎకరాలతోపాటు ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయి.
ఎడతెరిపి లేని భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు, ఆస్తి, ప్రాణనష్టం సంభవించడంతో ఆ యా జిల్లాల అధికార యంత్రాంగం జిల్లాల పరిధిలో జరిగిన నష్టాలను అంచనా వేసి సర్కారుకు నివేదించింది. పంటలతోపాటు వర్షాలకు కూలిన ఇండ్లు, ఇతర నష్టాలతోపాటు ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే వరదలకు మరణించిన వారి కుటుంబాలకు సర్కారు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధితులకు ఈ మేరకు నష్టం అందిస్తారో లేదో అనేది స్పష్టత ఇవ్వడం లేదు. ఉన్నత అధికారులకు నివేదించామని ఈ వివరాలన్నీ సర్కారుకు పంపించామని ఆయా జి ల్లాల అధికార యంత్రాంగం వివరించింది.