మల్దకల్, ఆగస్టు 23 : మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో సీడ్పత్తి సాగు చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పత్తిపంటలో కలుపు తీసేందుకు రాగా, మొసలి కనబడింది. భయాందోళనకు గురై పంట యజమానికి సమాచారం అందించారు. దీంతో సవారన్న పో లీసులకు విషయాన్ని తెలిపారు. కానిస్టేబుల్ పురందర్, నిరంజన్ పొలానికి చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి మొసలిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, పంట సమీపంలోని బావిలో మొసలి దూకింది.
అధికారులు ఐదుగంటల పాటు శ్రమించి మోటర్ల ద్వారా నీటిని బయటకు తోడి తాళ్ల సాయంతో మొసలిని బయటకుతీశారు. ఆటోలో తరలించి గద్వాల సమీపంలోని కృష్ణానదిలో వదిలేశారు. కాగా, కొన్నాళ్లుగా దేవర చెరువులో మొసలి ఉందని గ్రా మస్తులు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎట్టకేలకు మొసలి పట్టుబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.