Achampet | అచ్చంపేట, జూన్ 10 : రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీసులో ఉన్న జూనియర్ అసిస్టెంట్ శంకరయ్య, ఆంజనేయులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి కార్యదర్శి పి. గోపాల్, తాలూకా నాయకులు ఎస్. మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు రూ. 7500 ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా రైతు భరోసా డబ్బులు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత యాసంగి సీజన్లో 50 లక్షల మంది రైతులకు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రూ. 4366 కోట్లు రైతుల ఖాతాలలో వేసి చేతులు దులుపుకున్నారనీ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 15 రోజులు అవుతున్నందున రైతులందరూ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డి బాలచంద్రయ్య, గౌరయ్య, ఎన్ తిరుపతమ్మ, రైతులు పెంటయ్య, వెన్నెల ఆనంద్, ధర్మశీల జంగయ్య, డి లింగం, జై బక్కయ్య, శాంతమ్మ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.