కొల్లాపూర్, నవంబర్ 12 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఫారెస్టు అధికారులపై జరిగిన దాడికి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్నా ఫారెస్టు అధికారులు, సిబ్బంది కొల్లాపూర్‌కు తరలి వచ్చి డీఎఫ్‌వో రోహిత్ గోపిడి సారథ్యంలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఫారెస్టును విధ్వంసం చేసి చదును చేసిన ప్రాంతంలోనే మళ్లీ మొక్కలను నాటి అటవీ పునరుద్ధరణకు శ్రీకారం చూట్టారు. అంతకు ముందు కొల్లాపూర్ రేంజ్ కార్యాలయానికి చేరుకున్న 200 మంది ఫారెస్టు సిబ్బంది కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆలస్యం చేయకుండా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడిసి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం భారీ ఎత్తున ఫారెస్టు వాహనాల్లో ముక్కిడిగుండం గ్రామానికి వెళ్లి గ్రామంలో భారీ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అడవి అంతరించిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతిని వినాశనం జరుగుతోందని అందరూ అడవి రక్షణకు కట్టుబడి ఉండాలని కో రారు. అక్రమంగా అడివిలోకి ప్రవేశించి అడవిని ఆక్రమించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవోలు చంద్రశేఖర్, రా మ్మోహన్, రేంజ్ అధికారులు ఈశ్వర్, గురుప్రసాద్, వీరేశం, సుబ్బుర్, దేవరాజు, ముజీబ్ ఘోరి, ధర్మ, రాంబాబు, భగ్న, జయరాజు, తేజశ్రీ, శివ ఉన్నారు.
నార్లాపూర్ సెక్షన్ పరిధిలో 10 ఎకరాల్లో జిల్లా ఫారెస్టు అధికారుల ఆధ్వర్యంలో మొక్కలను నాటడంతో పాటు అక్కడే అడవి ప్రాంతంలో 200 మంది ఫారెస్టు అధికారులు, సిబ్బంది మకాం వేయనున్నట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. అడవి ఆక్రమణకు అడ్డు తగిలిన ఫారెస్టు అధికారులపై దాడి చేసిన ఘటనను ఫారెస్టు శాఖ సీరియస్‌గా తీసుకున్నది. అడవి ప్రాంతంలో ఎవరైనా పోడు వ్యవసాయం పేరుతో చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకడాదిలేదని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడం పూర్తి అయ్యేవరకు సిబ్బంది అడవిలోనే మకాం వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫారెస్టు అధికారులు, సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని 11మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అవుతోందని కొల్లాపూర్ ఎస్సై వృషికేష్ ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.