మాగనూరు, డిసెంబర్ 10 : పత్తి రైతుల ఆందోళన బాట పట్టా రు. ఆరుగాలం కష్టించి పండించిన తెల్లబంగారాన్ని విక్రయించేందు కు తీసుకొస్తే కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాయిచూర్-మహబూబ్నగర్ హైవేపై పత్తి ట్రాక్టర్లను అడ్డంగా ఉంచి 150 మందికిపై కర్షకులు రోడ్డుపై బైఠాయించారు. మాగనూరు మండలం వడ్వాట్ సమీపంలో ఉన్న బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ (కార్పొరేషన్ కాటన్ ఆఫ్ ఇండస్ట్రీ) వద్దకు నర్వ, అమరచింత, మరికల్, ధన్వాడ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలతోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పత్తిని తీసుకొస్తే నాలుగు, ఐదు రోజులుగా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మిల్లు వద్ద ఉన్న అధికారి పత్తి కొనుగోలు చేయడం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రోజుకు 80 నుంచి 100 ట్రాక్టర్ల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నా కేవలం 40, 30, 20 ట్రాక్టర్ల పత్తిని మాత్రమే కొంటున్నారని మండిపడ్డారు. మిల్లులో పత్తిని అన్లోడ్ చేసేందుకు కూడా యంత్రాలు సక్రమంగా లేవని.. సెకండ్ హ్యాండ్ మిషనరీలు ఉన్నా.. అవి పనిచేయడం లేదన్నారు. రైతులకు కనీసం తాగడానికి తాగునీరు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. సీసీఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాల పాటు ధర్నా చేయడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
విషయం తెలుసుకొన్న సీఐ చంద్రశేఖర్, ఎస్సై అశోక్ బాబు అక్కడకు చేరుకొని రైతులను సముదాయించినా వారు వినలేదు. కొద్ది సేపటి తర్వాత మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి వచ్చారు. మి ల్లు వద్ద ఉన్న అధికారి శివాజీతో మాట్లాడి సమస్య తెలుసుకొన్నారు. పత్తి అన్లోడ్ చేసే మిషనరీలు చెడిపోయాయని ఎమ్మెల్యేకు వివరించాడు. ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పత్తి అన్లోడ్ కోసం మిషనరీలు అందుబాటులో ఉంచాలని.. కారణాలు చెప్పొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. కాగా ఎమ్మెల్యే వస్తున్నాడని మిల్లు అధికారులు అన్లోడ్ చేసేందుకు జేసీబీ తెప్పించడంపై రైతులు మండిపడ్డారు.
నాలుగు రోజులుగా పడిగాపులు
కష్టపడి పండించిన పత్తిని విక్రయించేందుకు మా గ్రామం నుంచి శనివారం ఉదయం మిల్లు వద్దకు వచ్చాను.. మంగళవారం సాయంత్రం వరకు వేచి చూసినా అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు నత్తనడకన సాగుతుంది. రోజుకు 80 నుంచి 100 ట్రాక్టర్లు కొనేలా చర్యలు తీసుకోవాలి.
– సురేశ్, కున్సీ, నారాయణపేట జిల్లా
తాగేందుకూ నీళ్లులేవు
ఆదివారం ఉదయం పత్తి అమ్మేందుకు వ చ్చాను.. మూడ్రోజులుగా పడిగాపులు కాస్తు న్నాం.. ఎప్పుడు కొంటారో కండ్లు కాయలు కాసేలా ఉన్నాం.. మంచినీళ్లు కూడా దొరకక రోజుకు నాలుగు బాటిళ్ల నీళ్లు కొనుక్కుంటు న్నాం. నీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు.. తినేందుకు తిండి లేకపోయినా పర్లేదు కానీ నీళ్లు కచ్చితంగా ఉండాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
– లింగమ్మ, రైతు, ఎక్లాస్పూర్, నారాయణపేట జిల్లా