కల్వకుర్తి, నవంబర్ 3 : కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం తర్వాత హైడ్రామా మధ్య పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో రైతులు తాము సాగుచేసిన పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. స్లాట్‌లో బుక్ అయిన విధంగా రైతులు తమకు కేటాయించిన పత్తి కొనుగోలు(జిన్నింగ్ మిల్లుల)కేంద్రాల వద్దకు వాహనాల్లో తీసుకువచ్చారు. ఉదయం ఆరేడు గంటల వరకే కేంద్రాల వద్దకు చేరుకున్న రైతులకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న దాఖలాలు కనిపించలేదు. మధ్యాహ్నం అయినా ఎవరూ ఎ లాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన మొ దలైంది. ఒక వైపు ఆకాశం మబ్బులు కమ్ముకుంటుంది.. మరో వైపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. ఈ రోజు గడిస్తే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలంటే 15 రోజుల వరకు ఖాళీ లు లేదు. దీంతో ఓపిక నశించిన రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ సాయంత్రం 4గంటలకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తున్నామని గత నెలరోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతుంది. ప్రచారానికి తగ్గట్టుగా పత్తి కొనుగోళ్లను ప్రారంభించలేక పొయిందని రైతులు పెదవి విరుస్తున్నారు. ఉదాహరణకు నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో ఇప్పటి వరకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన కల్వకుర్తి వ్యవసాయ డివిజన్ లో మాత్రం ప్రారంభం కాలేదు. వ్యవసాయ మార్కెట్ శాఖ సహకారంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఇందుకు సీసీఐ పత్తి కొనుగోళ్లకు కొన్ని నిబంధన లు పాటిస్తున్నది. జన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా మార్చుకుంటున్నది. పత్తి మిల్లుల(జిన్నింగ్ మిల్లుల) సా మర్థ్యాన్ని, భద్రతను, నిర్వహణను పరిగణనలోకి తీసుకుని వా టికి మార్కులు(రేటింగ్) వేస్తూ కేటగిరీలుగా విభజిస్తున్నది. వాటినే ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4 అంటారు.
ఎల్ 1, ఎల్ 2 ఉన్న పత్తి మిల్లులలో పత్తి కొనుగొలు చేసేందుకు సీసీఐ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భా గంగా కల్వకుర్తి రెవెన్యూ, నియోజకవర్గంలో మొత్తం 11జిన్నింగ్ మిల్లులు ఉండగా మొదటి ప్రాధాన్యతగా ఎల్ 1, ఎల్ 2గా నాలుగు మిల్లులను గుర్తించింది. అందులో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నామని సీసీఐ ప్రకటించింది. రైతు లు తాము పండించిన పత్తిని సీసీఐకి విక్రయించి గరిష్ఠ ధర పొందేందుకు వీలుగా కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారు. తీరా మిల్లుల వద్దకు వచ్చిన రైతులకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఖంగుతిన్నారు. ఈ విషమయై ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు.
రెండు జిన్నింగ్ మిల్లులు కలిగిన ఓ వ్యాపారవేత్త సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా స్కెచ్ వేశారట. వ్యాపార వేత్తకు చెందిన రెండు జిన్నింగ్ మిల్లులు ఎల్ 1, ఎల్ 2గా ఎంపిక కాకపోవడంతో సదరు మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రాజకీయ పలుకుబడితోపాటు మార్కెట్‌తో సంబంధాలు కలిగిన ఆయన త నకు చెందిన రెండు మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు ఎక్కడా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు సాగించాడని సమాచారం. అందులో భాగంగానే సాయంత్రం వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.
ఎందుకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేద ని రైతులు అడిగితే.. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తాం అంటూ మార్కెటింగ్ అధికారులు సమాధానం ఇచ్చి దాటవేసే ప్రయత్నాలు చేశారు. విషయం ఏమిటంటే.. తాను జూబ్లీహి ల్స్ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నా.. రాలేను, మీరే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోండి అని ఎమ్మెల్యే చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా మార్కెటింగ్ అధికారులు మీన మేషాలు లెక్కించారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదనే విషయం తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. సంబంధితులకు అక్షింతలు వేయడంతో సాయంత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కరి కోసం ఇబ్బందులకు గురిచేస్తారా అని రైతులు మండిపడ్డారు.
తేమ శాతం నేపంతో పత్తి కొనుగోలు చేయడంలో తమను ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం పత్తి రైతులు కల్వకుర్తి- నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిపై బాలాజీ జిన్నింగ్ మిల్లు ఎదుట రాస్తారోకోకు దిగారు. అదేవిధంగా పత్తిని రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి మండలం తర్నికల్ సమీపంలోని బాలాజీ మిల్లులో సోమవారం సాయంత్రం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉదయం ప్రారంభించాల్సిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సాయంత్రం ప్రారంభించడమే కాకుండా, తేమ శాతం ఎక్కువగా ఉందని పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తిని ఎంత ఆరబెట్టినా.. మూట గట్టగానే తేమ శాతం పెరుగుతుందని, ఇదేమి పట్టించుకోకుండా అధికారులు పత్తిని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. 20 శాతం తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క చెబుతాడని, మరో పక్క అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మార్కెట్ ఏడీ, సీసీఐ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై పోసి పత్తికి నిప్పంటించారు. రాస్తారోకోతో వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. భారీ వర్షంలో కూడా రైతులు అలాగే రాస్తారోకో చేశారు.