నారాయణపేట టౌన్, అక్టోబర్ 17 : జిల్లాలో పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి పంట కోతలు ప్రారంభమైనా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యలేదు. దీంతో రైతులు తాము పండించిన పత్తిని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మిల్ల ర్లు పత్తి పంటకు తేమ శాతం ఎక్కువ ఉందని కారణం చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.7వేలలోపు పలుకుతుందని, మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కేంద్రాలు ఏర్పాటు చేస్తే తేమ శాతం ఉ న్న రైతులకు మేలు చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు.
జిల్లాలో మొత్తం లక్షా 52వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్, జూ లైలో మోస్తారు వర్షాలు కురిసినా ఆగస్టు త ర్వాత కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. దీంతో పత్తి దిగుబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 9 లక్షల 90వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
జిల్లాలో నోటిఫైడ్ చేసిన మొత్తం 6 మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్వింటాకు రూ. 7,521 మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8నుంచి 12శాతంలోపు తేమ శాతం ఉండాలని నిర్దేశించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి లో తేమ శాతం పెరిగిందని, దీంతో ధర తక్కువ పలుకుతుందని రైతులు వాపోతున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి తమకు గిట్టుబాటు ధర వచ్చేలా, కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లింపులు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.