మాగనూర్, ఆగస్టు 18 : మాగనూర్ మండల కేంద్రంలోని పోస్టాఫీసులో పెద్ద అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో మాగనూరు బీపీఎంగా పనిచేస్తున్న ధనుంజయ చేతివాటంతో ఖాతాదారులు పొదుపు చేసిన లక్షల రూపాయలు మాయమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అవినీతి జరిగిందని బీపీఎం నుంచి ఖాతా బుకులను జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ నత్తనడకన సాగుతుండడంతో మే 6న మాగనూరు పోస్టాఫీస్‌లో విచారణకు వచ్చిన జిల్లా అధికారులు ప్రశాంతి, ఉమాకాంత్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
ఈ పోస్టాఫీసులో మొ త్తం760 ఖాతాలు ఉన్నాయి. అందులో ఎస్బీ ఖాతాలు 36, ఆర్డీ ఖాతాలు 552, సుకన్య సమృద్ధ్ది యోజన ఖాతా లు 172 ఉన్నాయి. వీరంతా కొన్నేళ్లుగా పొదుపు చేస్తూ వస్తున్నారు. సుకన్య సమృద్ధ్ది యోజన ఖాతాల్లో 57 ఖా తా ల్లో తేడాగా ఉన్నాయి. బుకుల్లో మాత్రం స్టాంపు వేసి జమ చేసినట్లుగా ఉండగా అధికారికంగా జమ కాలేదు. ఖాతా బుకులు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఖాతాదారులు పొదుపు చేయడం లేదు. దీంతో ఖాతాదారులు ఆ పథకం ప్రయోజనం అందుతుందా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ వెంటనే పూర్తిచేసి తాము చేసిన పొ దుపు పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అం దుకు స్పందించిన అధికారులు సుకన్య సమృద్ధి యోజన పథకం యథావిధిగా కొనసాగుతుందని 20 రోజుల్లో విచారణ పూర్తి చేసి బీపీఎం స్వాహా చేసిన డబ్బులు ఖాతాల్లో జమ చేయిస్తానని అధికారులు హామీ ఇచ్చారు. కానీ మూ డు నెలలైనా ఈ విషయంపై ఊసే ఎత్తడం లేదు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నప్పుడల్లా అధికారులు మొహం చాటేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసల విచారణ నిర్వహించారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోస్టల్ అధికారులు స్పందించి బీపీఎంపై విచారణ నిర్వహించి లబ్ధిదారుల డబ్బులు ఖాతాల్లో జమచేయాలని కోరుతున్నారు.