జడ్చర్లటౌన్, ఏప్రిల్ 7 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం మొక్కజొన్న విక్రయాలు స్తంభించాయి. బస్తా తూకం బరువు పెంచాలంటూ ట్రేడ ర్లు టెండర్లు వేయకుండా టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సైతం టెండర్ల ప్రక్రియ మొదలుకాకపోవటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆకాల వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు మార్కెట్‌యార్డు కార్యాలయం ఆందోళన చేశారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 4,500 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది.
దాదాపు 120మంది రైతులు మొక్కజొన్న పంటను అమ్మేందుకు మార్కెట్‌కు రాగా, ఒక్కసారిగా ట్రేడర్స్ టెండర్లను వేయకుండా నిలిపివేయటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బస్తాకు 1300 గ్రా ములు అధికంగా తూకం వేస్తేనే టెండర్లు వేస్తామని ట్రేడర్స్ భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పటికే బస్తాకు 49కిలోలు మాత్రమే తూకం వేస్తుండగా అదనంగా 1300 గ్రాములు తూకం వేయ టం ఏమిటని రైతులు మండిపడ్డారు. ఈ తరుణంలో ఓ వైపు ట్రేడర్స్, రైతుల ఆందోళనతో మార్కెట్‌యార్డులో ఎక్కడిక్కడ మొక్కజొన్న టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది.
ఈ విషయాన్ని పలువురు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే సూచించటంతో పాలకవర్గసభ్యులు, మా ర్కెట్ కార్యదర్శి నవీన్ అక్కడికి చేరుకొని ట్రేడర్స్, రైతులతో మాట్లాడారు. తూకానికి సంబంధించి ఏదైనా ఉంటే చర్చించి చర్యలు తీసుకుంటామని ప్రస్తుతానికి టెండర్లు వేయాలని పాలకవర్గ సభ్యులు సూచించటంతో ట్రేడర్స్ టెండర్లు వేయటంతో యథావిధిగా లావాదేవీలు మొదలయ్యాయి.
ఏదిఏమైనా ఇప్పటికే 50 కిలోల బస్తాకు 49 కిలోలు మాత్రమే తూకం చేస్తున్న పరిస్థితిలో మరో 1300 గ్రాముల అధిక తూకం వేస్తే మరింత నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మాత్తుగా తూకాలను గురించి టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తే మార్కెట్‌కు వివిధ గ్రామాల నుంచి పంట తెచ్చిన రైతుల పరిస్థితి ఏమిటని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.