జడ్చర్ల, మే 12: జడ్చర్లలోని పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. నెలరోజుల కిందట మార్కెట్కు తీసుకొచ్చిన మక్కలను పదిరోజులకు కొనుగోలు చేశారని కానీ సరుకులను ఎత్తడంలో అలసత్వంతో రైతులు మార్కెట్యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం నెలరోజులకు పైగానే మార్కెట్లోనే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మక్కలకు కాపలాగా తిండితిప్పలు మాని మార్కెట్లోనే ఉండటం, ప్రతిరోజు ఇంటికి వెళ్లి రావడంతో సమయం వృథాతో పాటు ఖర్చులు కూడా భారమవుతున్నాయని వాపోతున్నారు. కొనుగోలు చేసిన మక్కలను గోదాంలకు తరలించేందుకు లారీల కొరతతో పాటు హమాలీల సమస్య అధికంగా ఉంది. స్థానికంగా గోదాంలు కూడా అధికంగా లేకపోవడంతో మహబూబ్నగర్ గోదాంలకు తరలించాల్సి వస్తుంది.
లోడ్ దించేందుకు రెండు, మూడు రోజులు ఆలస్యమవుతుందని లారీ డ్రైవర్లు అక్కడికి వెళ్లేందుకు సుముఖంగా లేరు. దీంతో కొనుగోలు చేసిన మక్కలను ఎత్తడంలో ఆలస్యమవుతుంది. జడ్చర్ల కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 630మంది రైతుల నుంచి 72,967బస్తాల మక్కలను కొనుగోలు చేయగా 37,000బస్తాలను గోదాంకు తరలించారు. మిగిలిన 35,733బస్తాలు యార్డులోనే ఉన్నాయి. మూడురోజుల కిందట రైతులు ధర్నా చేయడంతో మాజీఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచన మేరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా మూడు రోజులుగా మార్కెట్యార్డులోని షెడ్లలో మక్కలను స్టాక్ చేస్తున్నారు. యార్డులో మక్కలను స్టాక్ చేయడానికి హమాలీల కొరతతో ఇప్పటి వరకు కేవలం 10వేల బస్తాలను మాత్రమే స్టాక్ చేసినట్లు కొనుగోలు కేంద్రం ఇన్చార్జి వెంకటేశ్ తెలిపారు.
ఇంకా కొనుగోలు చేసిన 25వేల బస్తాలు మార్కెట్ ఆవరణలోనే ఉన్నాయి. ఇవేగాక రైతులు తీసుకొచ్చిన దాదాపుగా 30వేల బస్తాల వరకు ధాన్యం మార్కెట్ ఆవరణలోనే ఉండడంతలో మార్కెట్ పూర్తిగా మొక్కజొన్నలతో నిండి ఉంది. వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నాళ్లు నిరీక్షించాలంటూ రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన మక్కలను రైతులు తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని హమాలీలతో బస్తాకు రూ.10 వెచ్చించి యార్డులో స్టాక్ చేసేందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన మక్కలకు హమాలీలకు బస్తాకు రూ.25.66పైసలు చెల్లిస్తుండగా అదనంగా బస్తాకు పదిరూపాయలు చెల్లిస్తున్నామన్నారు. ట్రాక్టర్ కిరాయి ఒక ట్రిప్పుకు రూ.1,000 నుంచి 1,500 ట్రాక్టర్ యజమానులు కిరాయి తీసుకుంటున్నారు. స్టాక్ చేసే దగ్గర సమయానికి దించుకోకపోతే మరుసటిరోజు దించుకోవాల్సి వస్తే అదనంగా మరో రూ.1,500 వందలు ట్రాక్టర్కు వెయిటింగ్ కిరాయి ఇవ్వాలని ఇవన్ని తడిసి మోపెడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడిగాపులతో పరేషాన్ అవుతున్నాం
కొనుగోలు కేంద్రానికి వచ్చి 20రోజులకు పైగానే అవుతున్నది. 140 బస్తాల మక్కలను అమ్మకానికి తీసుకొచ్చా. రాత్రింబవళ్లు తిండి తిప్పలు మాని ఇక్కడే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి వద్ద ఎడ్లు, వడ్లు ఉన్నాయి. వాటిని చూసుకునే వారులేక నానా ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోలు చేసిన మక్కలను ఎత్తకపోవడంతో ఇక్కడే ఉండాల్సి వస్తోంది. హమాలీలకు అదనపు డబ్బులు, ట్రాక్టర్ కిరాయి, వెయిటింగ్ చార్జీలు భారమవుతున్నాయి. ఈ ఖర్చులను ప్రభుత్వం భరిస్తే బాగుంటుంది. హమాలీలు తక్కువగా ఉండటంతో రోజుకు మూడు నుంచి నాలుగు వేల బస్తాలను మాత్రమే స్టాక్ చేస్తున్నారు.
– జయపాల్రెడ్డి, రైతు కన్మనూరు, అడ్డాకుల మండలం
నెల రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు
మక్కల కొనుగోలు కేంద్రానికి 245 బస్తాల మక్క బస్తాలను తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది. ఇక్కడ ఈరోజు, రేపు అంటూ మక్కలను కొనుగోలు చేయలేదు. ఏప్రిల్ 29న మక్కలను కొనుగోలు చేశారు కాని ఇప్పటి వరకు ఎత్తలేదు. దీంతో ప్రతిరోజూ ఇంటికి వెళ్లి రావడం ఇబ్బందిగా మారింది. మార్కెట్ యార్డులో ఉండడంతో రోజుకు రూ.100 పైగానే ఖర్చు అవుతుంది. వర్షం వస్తే మక్కలు తడిసిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసిన మక్కలను ఎత్తాలని అడిగితే లారీలు రావడం లేదని, హమాలీల కొరత ఉందని అంటున్నారు.
-మైబు, రైతు గంగాపూర్, జడ్చర్ల మండలం
మక్కలు ఎత్తిన తర్వాతే కొత్త కొనుగోళ్లు
ఇప్పటి వరకు కేంద్రంలో కొనుగోలు చేసిన మక్కలను ఎత్తిన తర్వాతనే కొత్తగా కొనుగోళ్లు చేస్తామని కొనుగోలు కేంద్రం ఇన్చార్జి వెంకటేశ్ తెలిపారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన సెంటర్లో 72 వేలకుపైగానే బస్తాలను కొన్నాం. ఇప్పటి వరకు 37 వేల బస్తాలను గోదాంకు తరలించాం. ఇంకా తూకం వేసిన 32 వేల బస్తాలు మార్కెట్లో ఉన్నాయి. మంగళవారం వరకు 10 వేల బస్తాలను స్టాక్ చేశాం. ఇంకా 17 వేల బస్తాలు యార్డులో ఉన్నాయి. హమాలీల కొరతతో స్టాక్ చేయడం ఆలస్యమవుతోంది. ఒకటి రెండ్రోజుల్లో ఆరుబయట కొన్న మక్కలను స్టాక్ చేస్తాం.