మహబూబ్‌నగర్, మే 22 : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలను కలెక్టర్ జి.రవినాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి క్రీడాపాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు 18 క్రీడాంశాల్లో సీఎం కప్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా 16వేల గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండుశాతం రిజర్వేషన్ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ స్టేడియం 2014కు ముందు ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని, తెలంగాణ వచ్చాక స్టేడియాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నా రు. జిల్లాకు వాలీబాల్ అకాడమీ తీసుకురావడమే కాకుం డా, హాస్టల్ సైతం తీసుకొచ్చినట్లు చెప్పారు. త్వరలోనే సిం థటిక్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని, ఎంవీఎస్ కళాశాలలో మైదానం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. 28నుంచి 30వ తేదీ వరకు 10వేలమందితో రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
క్రీడాకారులు ఉన్నత లక్ష్యంతో ముందుకుసాగాలని సూచించారు. క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. క్రీడల్లో ప్రావీణ్యం పెంపొందించుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తే తల్లిదండ్రులకు మంచిపేరు వస్తుందన్నారు. ఉత్త మ ప్రతిభకనబర్చిన క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సా హం అందిస్తామన్నారు. రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో చాటిన క్రీడాకారిణి నిఖత్ జరీనాకు రూ.20కోట్లు విలువ చేసే స్థలంతోపాటు డీఎస్పీ ఉద్యోగం కల్పించినట్లు తెలిపారు. సీఎం కప్ టోర్నీలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ సీఎం కప్ మండలస్థాయి క్రీడాపోటీల్లో 4,360మంది క్రీడాకారులు పాల్గొనగా, జిల్లాస్థాయిలో 1000మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎస్పీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షు డు గోపాల్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, కోఆప్షన్ సభ్యుడు రాంలింగం తదితరులు పాల్గొన్నారు.