వనపర్తి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అంతర్జాతీయ విద్య అందని ద్రాక్షగా మారింది. తెలంగాణ ప్ర భుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించడం, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి శిలాఫలకం ప్రారంభించడంతో ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశ పడ్డారు. కానీ ఏడాది పూర్తయినా పనుల్లో వేగం పెరగకపోవడంతో ప్రజల ఆశలు ఆడియాశలయ్యాయి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ని ర్మాణం బుడి.. బుడి అడుగులతో అయ్యేది ఎప్పుడోనం టూ విద్యావంతులు.. మేధావులు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గురుకులాల వ్యవస్థను ఒకే గ్రూపుగా చేర్చి విద్యనందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇం డియా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. పదేండ్లపాటు గురుకులాల ద్వారా వివిధ వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించి పతాకస్థాయిలో ఫలితాలనందుకున్న వ్యవస్థను కాలరాస్తూ రేవంత్ సర్కార్ ఈ నూతన వ్యవస్థను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి, రెండు, మూడు దశల వారీగా వివిధ చోట్ల సీఎంతోపాటు ఇతర మంత్రుల ద్వారా ఈ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అయితే అంతవరకే పరిమితమైన ఈ కార్యక్ర మం అంతర్జాతీయ విద్య అందుకునేదెప్పుడంటూ విద్యా ర్థి లోకం ప్రశ్నిస్తుంది. ఇందులో 5 నుంచి 12 తరగతుల వరకు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉంది.
అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు గతేడాదిలో శ్రీకారం చుట్టారు. తాను పెరిగిన ఊరని, చదువుకున్న ప ట్టణమని ఇలా అవకాశమంతా ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శించి పెద్దఎత్తున శం కుస్థాపనలు చేశారు. 2025న మా ర్చి 2న వనపర్తిలో పర్యటించిన సీఎం ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఇప్పటికే 12నెలలు పూర్తయింది. దీనిపై ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఈ బడి నిర్మాణం కనిపిస్తుంది. సీఎం స్థాయిలో శంకుస్థాపన జరిగిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణమే ఇంతలా పెండింగ్ పడటంపై విద్యాభిమానులు మనోవేదన చెందుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థలం గుర్తించడంలోనూ వివాదం తలెత్తింది. మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో సమస్య ఉత్పన్నమైంది. పాఠశాలలో ఉండే విద్యార్థులకు ఆరోగ్యరీత్యా మంచిది కాద న్న వాదనలు బలంగా ఉత్పన్నమయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కళాశాల సమీపంలో నిర్మాణాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టనివ్వమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సహితం అల్టిమేటం ఇచ్చారు. ఇదిలా ఉంటే, మెడికల్ కళాశాల విద్యార్థులు సహితం త మకు కేటాయించిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ ం ఎలా చేపడతారన్న వాదన తెచ్చారు. మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం వద్దని మెడికల్ కళాశాల విద్యార్థులు సింగిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనేక వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు అనువుగా ఉన్నా..ఇక్కడనే చేస్తామంటూ అధికార పార్టీ పట్టుపట్టడం వివాదాస్పదంగా మారింది. చుట్టూ రేకులతో హద్దు ఏర్పాటు చేసుకొని గోతులు తీసి పనులను చేపట్టే దిశగా అడుగులు ఇప్పడిప్పుడే పడుతున్నాయి. వచ్చే రోజుల్లో ఈ కట్టడం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
నూతనంగా ఏర్పా టు చేయ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ళ్లు (వైఐఆర్ఎస్) నిధుల లేమితోనే పనులు మొదలు కావడం లేదు. ఇందుకోసం కాంగ్రెస్ సర్కారు అపసోపాలు పడుతుంది. అదిగో వచ్చే.. ఇదిగో తెచ్చే అన్నట్లు ఈ బడులపై ఊదరగొట్టిన సర్కారు..ఇప్పుడు వాటికి నిధులు సమకూర్చేందుకు వెనకాడుతున్నది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఆసి యా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ)ద్వా రా రుణం తీసుకొని వీటిని నిర్మించాలని తలపెట్టింది. అయితే రుణ మంజూరులో ఆలస్యం కావడంతో నిర్మాణాలన్ని పెండింగ్ పడ్డాయి. కాగా, రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించే నిధులు చాలా తక్కువగా ఉన్నందునా పనులు ముందుకు వెళ్లడం లేదు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే నిర్మాణాలు వేగంగా కొనసాగుతుండగా, మిగిలిన చోట్ల నత్తనడకను తలపిస్తున్నాయి. పనులు మొదలు కాలేదని వస్తున్న విమర్శలను తట్టుకునేందుకు అన్నట్లు ఏదో కొంత పని జరుగుతున్నట్లు కనిపిస్తుంది.
మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడం సరైన నిర్ణయం కాదు. మెడికల్ కళాశాలలో అన్ని రకాల పరీక్షలు.. ప్రయోగాలుంటా యి. వీటి దృష్ట్యా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పిల్లల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజకీయ కోణంలో చూడొద్దు. పేద కుటుంబాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మెడికల్ సర్జికల్ వేస్ట్, బయోవేస్ట్ తదితరాలు అక్కడ ఉండటం సహజం. వీటికి రెసిడెన్సియల్లో చదివే చిన్న పిల్లలు దూరంగా ఉండటమే క్షేమకరం. ప్రస్తుతం భవనం నిర్మాణం పూర్తయితే చాలని అధికారపార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్దులు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించడం లేదు. కేవలం రాజకీయంగానే చూడటంతోనే సమస్య పెరుగుతుంది.
– హేమంత్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలం ఇతర వాటికి ఉపయోగించొద్దు. ప్రాంగణంలో ఇప్పుడు ఎక్కువ ఖాళీ స్థలం కనిపిస్తున్నా ఓ నాలుగేళ్ల తర్వాత చాలా మార్పులుంటాయి. అనేక భవనాలు ఏర్పడనున్నాయి. ఇంకా చాలా నిర్మాణాలు జరిగేవి ఉన్నాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 57ఎకరాల స్థలం కేటాయించారు. మెడికల్ కళాశాల అవసరాలు ఏడాది ఏడాదికి పెరుగుతాయి. వాటని పరిగణలోకి తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మరొక చోట స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలి. పేద పిల్లల ఆరోగ్యాన్ని రాజకీయాలకు ఫణంగా పెటొద్దు.
– మదన్, 18వ వార్డు, సీపీఎం కౌన్సిలర్, వనపర్తి