పెద్దమందడి : ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభతో (BRS Silver Jubilee) రాష్ట్రంలో కాంగ్రెస్( Congress) పని ఖతం కాకతప్పదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ (Vakiti Sridhar) జోస్యం చెప్పారు. శనివారం పెద్దమందడి మండల కేంద్రంతో పాటు జగత్ పల్లి, మణిగిల్ల, ఆల్వాల్, చిన్న మందడి గ్రామాల్లో శ్రీధర్ ఆధ్వర్యంలో రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు ( Six Gurantees ) , 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు, రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాల్లో తిరగడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు.
15 నెలల రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో అభివృద్ది విధ్వంసానికి గురైందని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పదవీకాలంలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అగ్రగామిగా నిలిపారని అన్నారు. రోడ్ల విస్తరణ, చెరువుల మరమ్మతు , మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ,అగ్రికల్చర్ కళాశాలలు, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయి,సంక్షేమ పథకాల కోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధిలో ఉన్నదని, అటువంటి తెలంగాణను కాంగ్రెస్ అధోగతి పాలుజేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి , మణిగిల్ల శ్రీనివాస్ గౌడ్, గోపాల్పేట, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు, సింగిల్ విండో ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ , గొర్ల కాపరుల డైరెక్టర్ నాగేంద్ర యాదవ్, చిట్యాల రాము, కోట్ల వెంకటేష్, శివ గౌడు, లక్ష్మణ్ గౌడ్, సేనాపతి తదితరులు పాల్గొన్నారు.