మహబూబ్‌నగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఓ అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మారింది. రెండ్రోజుల కిందట ఇలా నామినేషన్ వేశాడో.. లేదో.. అలా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతుండడంతో కాలనీవాసులే విస్తుపోతున్నారు.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి.. ఉన్నతాధికారులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 27వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 11వ డివిజన్ నుంచి అధికార పార్టీ అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. రెండేళ్లుగా చీకట్లో మగ్గిన బండమీదిపల్లికి హైమా స్ట్ లైట్లు వేయాలని స్థానికులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు అధికార పార్టీ నేతలు నామినేషన్ వేయగానే రాత్రికి రాత్రే 10 చోట్ల లైటింగ్ ఏర్పాటు కోసం పోల్స్ బిగించడంతో ఓటర్లు ముక్కున వేలేసుకున్నారు.
కార్పొరేషన్ ఎన్నికల ముందే..
బండమీదిపల్లిలో లైట్లతో పాటు రెండు బోర్లను వేసి మోటర్లు సైతం బిగించారు. ఇదంతా మున్సిపల్ అధికారుల అండదండలతో జరగడం గమనార్హం. బండమీదిపల్లిలో రెండేళ్లలో జరగని పనులు కేవలం రెండు, మూడ్రోజుల్లోనే ప్రారం భం కావడం జిల్లా ఉన్నతాధికారులంతా కొలువుదీరే చోట బహిరంగంగా నిబంధనలను ఉల్లంఘించడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల నియమావళి మాత్రం బండమీదిపల్లి పనులకు అడ్డురావడం లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటి వరకు 10 హైమాస్ట్ లైటింగ్ పోల్స్, రెండుకుపైగా బోర్లు ఎలాంటి పర్మీషన్ లేకుండా రాత్రివేళల్లో వేశారని ఆ డివిజన్ ప్రజలే చెబుతున్నారు.
ఎన్నికల ముందు జరుగుతున్న పనులను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు పగలు సమయం సరిపోనట్లు రాత్రిళ్లు జరగడం కొసమెరుపు. కాగా బండమీదపల్లిలో 11 డివిజన్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు మారేపల్లి సురేందర్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చర్య తీసుకోకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి కలుస్తామని, అతడి నామినేషన్ తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఓ కాంగ్రెస్ నేత కోసం కార్పొరేషన్ అధికారులు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, ఆ నేత ఆదేశాలతో అవసరం ఉన్నా లేకున్నా లైట్లు బిగించడం చర్చనీయాంశంగా మారింది.