వనపర్తి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో యువ నాయకుడు ఏర్వ సాయిప్రసాద్యాదవ్తోపాటు పలువురు యువకులు పెద్ద ఎత్తున మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇ చ్చిన ఏ ఒక్క హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ కండువాను చూసినా ప్రజలు చేతులెత్తి దండం పెట్టే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. అధికారంలోకి రావడం కో సం అనేక అబద్ధపు హామీలిచ్చిన కాంగ్రెస్ రెండేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ హామీలు అమలు చేయడంలో పూ ర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇంకా ప్రజలు మోసపోవడం కోసం సిద్ధంగా లేరని, గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను రెట్టింపు చేసి ఇస్తామంటేనే ప్రజలు నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా రుణమాఫీ పథకం, రెండు విడుతల రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టడమే కాకుండా కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఊసేలేదని, వృద్ధులు, వితంతువులకు డబుల్ చేసి ఇస్తామన్న పింఛన్ జాడే కనిపించడం లేదని ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులను అందినకాడికి దోచుకుతిన్నారని, ఒక్కొ లారీకి పది క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు తరుగు, ఇతరత్రవాటి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని మండిపడ్డారు. ఒకసారి తూకం చేసిన అనంతరం బస్తాలు తీసుకెళ్లి రైతులకు తరుగు పేరుతో క్వింటాళ్లకు.. క్వింటాళ్లు తక్కువ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ నాడైనా లారీకి వడ్లు ఎత్తుకెళ్లిన అనంతరం ఇలా తరుగుల పేరుతో ఢోకా జరిగిందా అని గుర్తు చేశారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు చెప్పి కాంగ్రెస్ నేడు గ్రామాల్లో నిబంధనల పేరుతో అన్యాయం చేసిందన్నారు. ఇంటి నిర్మాణం ఒక్క ఫీటు ఎక్కువ కట్టినా బిల్లు రాదంటు అధికారులతో షరతులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ద్వారానే సంక్షేమ పథకాలన్నీ సవ్యంగా సాగుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే అని ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించేందుకు కార్యోన్ముకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరి కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగినరీతిలో పార్టీ గౌరవం కల్పిస్తుందన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసిన వారికి పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని,వారిని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని కోరారు.
అనంతరం సాయిప్రసాద్ మాట్లాడు తూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం శాయశక్తులా పని చేస్తానని, పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు మాణిక్యం, కురుమూర్తియాదవ్, రఘువర్ధన్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, ప్రే మ్నాథ్రెడ్డి, నరేశ్ కుమార్, నర్సింహ, మాధవరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నందిమళ్ల అశోక్, సుదర్శన్‌రెడ్డి, నర్సింహ, ఇమ్రాన్, నాగన్నయాదవ్, జమీల్ పాల్గొన్నారు.