అచ్చంపేట/ఉప్పునుంతల, మార్చి 9: అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొన్నది. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన నాయకులు, శ్రేణులకు గెలిచిన తర్వాత పార్టీ లో గుర్తింపు లేకుండా పోయిందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. పార్టీలో పాత, కొత్త అనే చర్చలు జరుగుతున్నాయి. కొత్తవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్లను పట్టించుకునే పరిస్థితి లేదని కొందరు నాయకులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్‌లో ఎవరిని కదిలించినా అసంతృప్తితోనే కనిపిస్తున్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మ రాజల్రావు నా యకుడు ప్రభాకర్‌రావు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆదివా రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ భర్త, సీనియర్ నాయకుడు రాజల్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు పార్టీకోసం అన్ని విధాలా కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు.
మధ్యలో వచ్చిన వారికి నామినేటేడ్ పదవులు కట్టబెడుతూ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డా రు. గతేడాది మామిళ్లపల్లి ఆలయ చైర్మన్‌గా తాత్కాలికం గా పనిచేశానని, ఏకపక్షంగా ఆలయ చైర్మన్ పదవి వేరే గ్రా మస్తులకు కట్టబెట్టారన్నారు. పార్టీ కోసం, ఆలయం అభివృద్ది కోసం సొంతంగా రూ. లక్షలు ఖర్చుచేశానన్నారు. సంబంధం లేని వారికి డైరెక్టర్ పదవులు కట్టబెట్టి కాంగ్రెస్ కొత్త ఆచారం తీసుకొచ్చిందని, ఒంటెద్దు పోకడలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్రావు, మామిళ్లపల్లి మాజీ స ర్పంచ్ దామోదర్, రామస్వామిగౌడ్, మురళీధర్‌రావు ఉన్నారు.