మహబూబ్నగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్యం దుకాణాలను సిండికేట్గా మారి లక్షలు.. లక్షలు పోసి దక్కించుకున్న వారిపై బెదిరింపులు మొదలయ్యాయి. పాలమూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు కాంగ్రెస్ నేతలు వైన్ షాపులో యజమానులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. మద్యం దుకాణాలకు అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న పర్మిట్ రూముల వద్ద చిల్లర కొట్టు వ్యాపారాలు తమ నేతలకే ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీనికి ఒప్పుకోని వ్యాపారులపైకి ఎక్సైజ్ అధికారులను ఉసిగొలిపి నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములకు తాళం వేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులు గడుస్తున్నా ఇంకా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆందోళనకు దిగుతామని మద్యం వ్యాపారులు హెచ్చరించడంతో కథ అడ్డం తిరుగుతోంది.
ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే కొందరు కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారానికి పాల్పడడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు కొంతమందికే పర్మిట్ రూముల వద్ద చిల్లర వ్యాపారాలకు ఇస్తే మేము ఎక్కడికి పోవాలని మరింత మంది సదరు నేతను దబాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తమ దందాలలో దూరితే ఇక దుకాణాలు మూసి ఆందోళన చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా ఎక్సైజ్ మంత్రి సొంత ఇలాకాలో చోటు చేసుకోవడం.. దీనికి ఆబ్కారీ శాఖాధికారులు వత్తాసు పలకడం సంచలనాత్మకంగా మారింది.. మహబూబ్నగర్లో మొత్తం 16 వైన్ షాపులకు అనుమతులు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన టెండర్లను మద్యం వ్యాపారులంతా రూ.కోట్లు గుమ్మరించి షాపులు దక్కించుకున్నారు. 15 షాపులు ఉంటే.. ఇందులో 13 షాపులకు పర్మిట్ రూములకు అనుమతులు ఉన్నాయి.
ఒక్కో షాపునకు రూ.5 లక్షలు ప్రతినెలా పర్మిట్ రూములకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిసెంబర్ ఒకటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. ఇక్కడే కాంగ్రెస్ నేతలు పర్మిట్ రూముల వద్ద పల్లీలు, బఠానీలు, వాటర్ బాటిళ్లు, చికెన్, మటన్ అమ్మేందుకు ఏర్పాటు చేసే దుకాణాలను కూడా తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఒప్పుకోని వైన్ షాపుల పర్మిట్ రూములకు తాళాలు వేశారు. కాంగ్రెస్ నేతలు తమ కడుపులు కొడుతున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఎక్సైజ్ అధికారులు నిబంధనలు విరుద్ధంగా తమ షాపులకు వేసిన తాళాలు తీయకపోతే త్వరలో దుకాణాలు బంద్ చేసి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు ఎక్సైజ్ అధికారులు ఎవరు చెబితే తాళాలు వేశారో అధికార పార్టీ నేతలకే అర్థం కావడం లేదట.. కాగా పర్మిట్ రూములు మూయడంతో షాపుల ముందు మందు తాగి చిందేస్తున్నారు.