వనపర్తి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం నెలకొన్నది. వనపర్తి జిల్లా అధికార పార్టీలో వర్గవిబేధాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో ఎమ్మెల్యే వర్గానిదే పైచేయిగా కనిపిస్తున్నది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితిని కొనసాగించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే వర్గం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఇందుకు ప్రతిగా చిన్నారెడ్డి వర్గం సైతం స్థానికంలో తమ వారికి ప్రాధాన్యత ఉండాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక.. పార్టీ బీఫాంలు అందించడంలోనే అసలు సమస్య ఉత్పన్నం కానున్నది. ప్రభుత్వం నుంచి.. పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేకే టికెట్ల ఎంపిక అధికారాన్ని కట్టబెడితే ఏం చేయాలన్న తర్జన భర్జన కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో రెండు వర్గాలకు సమ ప్రాధాన్యనివ్వాలన్న డిమాండ్‌ను కొందరు లేవనెత్తుతుండటంపై పార్టీలో స్థానిక సంస్థల టికెట్ల కలవరం మొదలైంది.
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కేబినెట్ ర్యాంకులో చిన్నారెడ్డి కొనసాగుతున్నారు. చెప్పుకోవడానికి పెద్ద పదవి ఉన్నా.. ఏ చిన్న పని పురమాయించినా.. అధికారులు ఎమ్మెల్యే పేరు చెప్పి పక్కకు తప్పుకుంటున్నారని అప్పట్లో చిన్నన్న మనోవేదనకు గురయ్యారు. 46 ఏండ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నా తనకు ఒక చిన్న పని చేయించలేని కేబినెట్ ర్యాంక్ ఎందుకన్నట్లు ఆయన వర్గీయులు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని అ నుచరులు గుస్సా మీదున్నట్లు సమాచారం. ఇలా వేర్వేరు కాపురాలతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానికంపై తీసుకునే అధిష్టాన నిర్ణయంపై నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొన్నది.
స్థానిక ఎన్నికల సమరం కోర్టు పరిధిలో ఉన్నా.. ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అని తేడా లేకుండా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే కసరత్తులో నాయకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ మండల, జిల్లా స్థాయిలోనూ ముఖ్య నాయకుల సమావేశాలను నిర్వహించి లోకల్ బాడీ ఎన్నికలకు దూకుడు పెంచింది. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని కారు జోరు మీదున్నది. ఇక కాంగ్రెస్ సహితం అధికారిక కార్యక్రమాలను ఆసరా చేసుకొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ ఎవరికి వారు ఎత్తుగడలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన అనేక ఘటనలతో వనపర్తి కాంగ్రెస్ కలిసి నడిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందులో చిన్నారెడ్డి వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అంశం తెరపైకి వచ్చినా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఉన్నది. 1989లో వనపర్తి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన చిన్నన్న 1999, 2004, 2014ల్లోనూ అసెంబ్లీకి సారథ్యం వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అంశంపై 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ద్వారా వనపర్తిలో తెలంగాణ
గర్జన సభ నిర్వహించి మళ్లీ వేడి పుట్టించిన సంగతి తెలిసిందే.
ఇంత చరిత్ర ఉన్న చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి అభ్యర్థిగా టికెట్ కేటాయింపు మొదలు.. ఇటీవలి గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు వరకు అన్యాయం జరిగిందంటూ ఆయన వర్గీయులు ఆవేదనతో ఉన్నారు. గ్రామాల్లో వేసిన ఇందిరమ్మ కమిటీలకు చిన్నారెడ్డి వర్గం సహితం అన్ని మండలాల్లో దరఖాస్తులు చేసుకోగా ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత లభించిందన్న చర్చ లేకపోలేదు. దీంతో పార్టీలో రెండు వర్గాలు ఏర్పడి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక స్థానికంలోనూ ఎమ్మెల్యే ఏకచక్రం తిప్పుతారా..? అధిష్టానం చిన్నారెడ్డికి ప్రాధాన్యత కల్పిస్తుందా? అన్న చర్చ జోరందుకున్నది.