వనపర్తి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అదనపు నీళ్లను తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నా.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ చర్యలతో వచ్చే రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు కృష్ణానది నీళ్ల సమస్య ఉత్పన్నం అవుతుందని సింగిరెడ్డి చెప్పారు. రెండు రాష్ర్టాల కృష్ణా నదీజలాల వినియోగంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబునల్ తీర్పు వెలువడే వరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి కొత్త పనులను చేపట్టరాదని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం ఎడమ కాల్వలో ప్రస్తుతం 50 వేల క్యూసెక్టుల నీరు వెళ్లే సామర్థ్యం ఉందని, ఇదే కాల్వను 90 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం ఆధునీకరిస్తుందన్నారు. ఇంత దుర్మార్గం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అడ్డుకట్ట వేసే ప్రయ త్నం చేయడం లేదని, గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఈ పనులను మొదలు పెడతామంటే.. కేసీఆర్ అప్పట్లో అడ్డుకోవడంతో నిలిచిపోయిందన్నారు. ఈ చర్యల వల్ల కృష్ణా నదిలో నీటి శాతం తగ్గిపోతుందని, తద్వారా తెలంగాణలోని కృష్ణానదిపై ఆధారపడ్డ జిల్లాలకు తీవ్ర సాగునీటి సమస్యలు తలెత్తుతాయన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ప్రజలకు కాంగ్రెస్ వేస్తున్న సాగునీటి శిక్షగా నిరంజన్‌రెడ్డి అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వ చర్యలతో శ్రీశైలంపై ఉన్న తెలంగాణ జల విద్యుత్‌పైన కూడా ప్రభావం పడుతుందని, రెండు రాష్ర్టాల మధ్య నదుల నీటిపై చట్టబద్ధత తాత్కాలికంగానే కొనసాగుతుందన్నారు. త్వరలోనే బ్రిజేశ్‌కుమార్ ట్రిబునల్ తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం కలిగించే చర్యలకు పూనుకున్నదన్నారు. ఏ ప్రాంత రైతులకైనా సాగునీరు అందించే చర్యలకు తాము వ్యతిరేకం కాదని, చట్టబద్ధ్దత లేకుండా అడ్డదారుల్లో చేసే ప్రయత్నాలకే తాము వ్యతిరేకమన్నారు.
కృష్ణానది నుంచి అత్యధిక నీరు తీసుకెళ్లాలని పనులను చేపట్టిన శ్రీశైలం ఎడమ కాల్వ లైనింగ్ పనులను వెంటనే ఆపాలని, ఏపీ బలబడటం కోసం తెలంగాణకు అన్యాయం చేస్తామంటే చూ స్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. దీనిపై కాం గ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేవలం గత ప్రభుత్వంపై తూలనాడుకుంటూనే కాలం గడుపుతామంటే కుదరదన్నారు. కృష్ణానది నీటి వినియోగంపై ట్రిబునల్ తీర్పు వచ్చే వరకు శ్రీశైలం ఎడమ కాల్వ ఆధునీకరణ పనులను నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
90 శాతం పనులను పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా పక్కకు పెట్టిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. మిగిలిన పనులు పూర్తి చేసి సాగునీరందిస్తే.. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న కుట్రతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని విమర్శించారు.
సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టును ఇలా ఎండబెట్టి.. నల్లగొండకు సాగునీరు తీసుకెళ్లేందుకు ఏదుల రిజర్వాయర్ నుంచి అత్యధిక ఖర్చును చేస్తూ రూ.1800 కోట్లతో మొదటి దశ టెండరును పూర్తి చేసి సీఎం బావమరిదికి నజరానాగా కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్ నుంచి కేవలం 100 కోట్లతో డిండికి సాగునీరిందించే అవకాశం ఉన్నా.. ఇక్కడి రైతులకు సాగునీటి ఇబ్బంది కల్గించేలా ఏదుల నుంచి డిజైన్ చేశారన్నారు. ఈ ప్రాజెక్టు గుత్తేదారులకు లాభం.. రైతులకు నష్టం అన్న చందాన రూపకల్పన జరిగిందని, నల్లగొండకు సాగునీటిని అందించే క్రమంలో పాలమూరు ప్రజల జీవితాలతో ఆటలాడవద్దని సింగిరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం అంతర్మథనంలో పడిపోయిందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలపై డిఫెన్స్‌లో పడ్డారని, దేశంలో కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నదన్నారు. ఇటీవలి హెచ్‌సీయూ ఘటనతోపాటు అంతకుముందు వరుసగా చేస్తున్న తప్పిదాలే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ కాంగ్రెస్‌ను దిగజార్చాయని గుర్తు చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గులాం ఖాధర్, కురుమూర్తియాదవ్, నందిమళ్ల అశోక్, నాగన్న యాదవ్, జోయబ్ తదితరులు పాల్గొన్నారు