కల్వకుర్తి, జూన్ 5 : యాసంగి వడ్ల విక్రయాలు రైతులకు కన్నీళ్లు తెచ్చిపెడుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మనిషి రక్తం రుచి మరిగిన పులిలా..రైతులు పండించిన వడ్లను తరుగు రూపంలో జుర్రుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలైన పీఏసీసీఎస్, మెప్మా, మహిళా సంఘాలు కేవలం కమిషన్లకు మాత్రమే పరితమితమయ్యాయి. తరుగు విషయంలో ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోకపోవడంతో రైతులు కంట తడి పెట్టుకుంటున్నారు.
మిల్లర్లందరూ సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘ నాయకులు మండిపడుతున్నారు. గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలనే చందంగా మిల్లర్లు దోపిడీకి తెగబడుతున్నారని, కనికరం లేకుండా తరుగు పేరిట కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా తరుగుతీస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకునేవారే లేరా? అని జిల్లాలోని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కల్వకుర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఓ రైతు దాదాపు 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. దాదాపు 300 కింటాళ్ల వడ్లు దిగుబడి వచ్చింది. సమాజంలో అంతో ఇంతో పేరున్న ఆ రైతు వడ్లను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రమైన పీఏసీసీఎస్ అనుమతిలోని ఓ రైస్ మిల్లు వద్దకు తీసుకెళ్లాడు. మిల్లు యజమాని రండి రండి అంటూ స్వాగతం పలికాడు. వడ్ల నమూనా తీసుకుని తేమ, బరువు శాతాన్ని పరీక్షించాడు. ఇంత దూరం మీరు రావాలా అంటూ వినయం చూపించాడు. బస్తాకు ఒక కిలో చొప్పున తరుగు తీస్తానని చెప్పగా సదరు రైతు సరేనన్నాడు. క్వింటాకు రెండున్నర కిలోల తరుగు అయితే మొత్తంగా ఏడున్నర క్వింటాళ్ల తరుగు పోతుందని రైతు భావించి కాస్తంత సంతోషంగా ఉన్నాడు.
మిల్లు యజమాని టకాటకా లెక్కలేసి తూకం కాగితాలను రైతుకు ఇచ్చాడు. సంతోషంలో ఉన్న సదరు రైతు కాగితాలను పరిశీలించకుండా ఇంటికి వెళ్లిపోయాడు. తీరా ఇంటికెళ్లాక తూకం కాగితాలను చూడగానే రైతు ఆనందం ఆవిరైంది. తేమ, బరువు తక్కువగా ఉందని క్వింటాకు 9 కిలోల చొప్పున మొత్తంగా 27 కింటాళ్ల తరుగు తీసినట్లు అందులో ఉండగానే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనలాంటి పేరున్న వారికే క్వింటాకు 9 కిలోల తరుగుతీస్తే సామాన్య రైతుల పరిస్థితి ఏంటని వాపోయాడు. నమ్మి నట్టేట మునిగినట్లయింది కదా అని తన బంధువులతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలు కమిషన్ కేంద్రాలుగా మారిపోయాయి. కేవలం గన్నీ బ్యాగులు ఇవ్వడం, మిల్లర్లు ఇచ్చిన తూకం పట్టీలను సివిల్ సైప్లె పోర్టల్‌లో నమోదు చేయడం తప్పా వారి వద్ద కాంటా లేదు బాటు లేదు. ధాన్యం పండించిన రైతే.. మిల్లు వద్దకు వెళ్లాలి. మిల్లరు ఛీ కొడుతున్నా బ్రతిమాలాలి. తరుగు విషయంలో కాస్త కనికరించమని కాళ్లు పట్టుకున్నంత పనిచేయాలి. వడ్లు నాణ్యత లేవు. వడ్లు తీసుకోలేను..మా టైం వేస్ట్ చేయకు అంటూ పురుగును తీసేసినట్లు తీసేస్తున్నా.. అక్కడే కాపు కాయాలి. చివరకు తీసిన తరుగును చూసి ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంటి దారి పట్టాలి. మిల్లర్లు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే శేష ప్రశ్న.
అన్యాయం జరుగుతున్నా అడగాలంటే రైతు లు భయపడుతున్నారు. గట్టిగా అడిగినా.. ఆందోళన చేసినా కేసులు నమోదు చేసి జైళ్లకు తరలిస్తే ఇళ్లు వాకిలి, గోడ్డు గోదా ఏమైపోతాయనే భయంలో కుక్కిన పేను లా ఉండాల్సిన దుస్థితి రైతులకు ప్రజాపాలనలో ఉంది. వంగూర్‌లో చోటుచేసుకున్న ఉందంతాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. 15 రోజుల కిందట రైతులతో కలిసి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేను గట్టిగా అడిగిన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
మూడు రోజుల కిందట వడ్లకు తరుగుతీయవద్దని ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. ప్రజాపాలన నియంత పాలన అయిందని రైతులు వాపోతున్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని గట్టిగా అడగలేని పరిస్థితి వచ్చిందని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. మిల్లర్లపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు వ్యహరిస్తున్న ఉదాసీనత వల్లే రైతులు నిలువునా మునుగుతున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
కల్వకుర్తి పట్టణంలోని ఒక మిల్లుకు, వంగూర్ మండలంలోని మరో మిల్లుకు కొనుగోలు కేంద్రమైన పీఏసీసీఎస్ ద్వారా వడ్లు పంపించాను. కల్వకుర్తి మిల్లుకు 160 క్వింటాళ్లు, వంగూర్ మిల్లుకు 70 క్వింటాళ్ల వడ్లను పంపిస్తే రెండు మిల్లుల వారు కూడబలుక్కున్నట్లు క్వింటాకు 10 కిలోల చొప్పున తరుగుతీశారు. వడ్లు ఎండ బెట్టుకుని కొనుగోలు కేంద్రం నిబంధనల ప్రకారం తీసుకెళ్లినా మొత్తంగా 230 క్వింటాళ్లకు 23 క్వింటాళ్ల తరుగుతీశారు. పీఏసీసీఎస్‌లో అడిగితే తాము ఏం చేయలేమని అంటున్నారు. మిల్లుల వారిని అడిగే పరిస్థితే లేదు. ఇటువంటి దారుణం ఎప్పుడూ చూడలేదు. రైతులను నిలువునా ముంచుతున్న ఇలాంటి మిల్లులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. తరుగు పేరున దాదాపు రూ.50వేలను నా నుంచి దోచుకున్నారు. ప్రజాపాలనలో రైతులను దోచుకునేందుకు వ్యాపారులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఉంది.
– కే.గోవర్ధన్‌రెడ్డి, రైతు, తాండ్ర, కల్వకుర్తి మండలం