వనపర్తి, మే 18 (నమస్తే తెలంగాణ) : ఈదురు గాలులు.. అకాల వర్షాలు వెరసి యాసంగి కల్లాల్లో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 396 కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించినా ఎక్కడా ప్రక్రియ సవ్యంగ సాగడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు అన్నీ సమస్యలే.. అన్నట్లు ఏ రైతును కదిలించినా తమ అవస్థలు చెప్పుకొని రోదిస్తున్నారు. పక్షం రోజులైనా గన్నీ బ్యాగులు ఇవ్వరు.. తూకం చేయరు.. మరో పక్షం రోజులైనా లారీలకు ఎత్తరు.. ఇలా కల్లాలు, ఇతర కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం అమ్ముకునే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నా యి.
వనపర్తి జిల్లాలో యాసంగిలో 3.50 లక్షల వరి ధాన్యం వస్తుందన్న అంచ నా ఉంది. దీనికి తగ్గట్టుగా అధికార యం త్రాంగం ఏర్పాట్లకు కార్యాచరణ తీసుకున్నది. అయితే.. ముందు నుంచి కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అధికారుల పర్యవేక్షణ ఉన్నా పనులు మాత్రం సవ్యంగా సాగడం లేదు. వెరసి జిల్లాలోని కొన్ని మం డలాల్లో ప్రైవేట్ వ్యాపారులే ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వ సెంటర్లలో బాధలు భరించలేక తక్కువ ధరలకు ధాన్యంను ప్రైవేట్‌కు ధారాదత్తం చేశారు. శనివారం సాయంత్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం సైతం అన్నదాతలను అతలాకుతం చేసింది.
జిల్లాలో ఇప్పటి వరకు 90 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత నెల నుంచి కొనుగోళ్ల వ్యవహారం నడుస్తున్న క్రమ పద్ధతిలో ముందుకు సాగడం లేదు. సవ్యంగా కొనుగోళ్లు జరిగితే.. ఈపాటికే సగానికి పైగా కొనుగోళ్లు జరిగేవన్న అంచనా ఉంది. లక్ష్యానికి సరిపడా కొనుగోళ్లు జరగడం లేదు. ప్రధానంగా లారీల సమస్య సెంటర్లలో ధారుణంగా ఉన్నది. ట్రాన్స్‌పోర్టు ప్రక్రియ పేపర్ల మీదున్నట్లుగా మోకాపై జరగడం లేదు. అక్కడున్నది వేరు.. ఇక్కడ జరుగుతున్నది వేరుగా ఉంది. దీంతోనే సమస్య జఠిలమవుతుంది. టెండర్లను తీసుకున్న కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు వ్యవహరించక పోవడంతోనే సెంటర్లలో రకరకాల ఇబ్బందులకు కారణమవుతుంది. వాహనాలు లేకున్నా టెండర్లు వేసుకోవడం ద్వారానే ఈ దుస్థితి దాపురించిందన్న విమర్శలు వెలువడుతున్నాయి.
అధికారులు వేసిన అంచనాల ప్రకారం దాదాపు ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. రైతులు సాగు చేసిన యాసంగి లెక్కల ప్రకారం అధికారులు గతంలోనే ధాన్యం అంచనా వేశారు. వాటి ప్రకారమే ఇంకా ఖచ్చితంగా ధాన్యం నిలువలు ఉన్నాయి. ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించ ని కేంద్రాలు కూడా జిల్లాలో ఉన్నాయి. ఈ 90 వేల మెట్రిక్ టన్నులు కొనడానికే ఇంతలా పరిస్థితులున్నాయి. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసే వరకు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మరో 20 రోజులకు పైగా కొనుగోళ్లు జరిపినా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా చాలా గ్రామాల్లో సగం కూడా జరగలేదు. ఆత్మకూరు, అమరచింత, మదనాపురం మండలాల్లో కొంత ముందు వరుసలో ఉన్నా.. మిగిలిన మండలాల్లోని గ్రామా ల్లో కొనాల్సిన ధాన్యం చాలా ఉంది. ఎక్కడ చూసినా కుప్పుల తెప్పలు దండిగా దర్శనమిస్తున్నాయి. 10, 20, 30 రోజుల నుంచి సెంటర్లలో మగ్గుతున్న రైతులున్నారు. సవ్యంగా సాగుతున్న సెంటరు ఎక్కడా వెతికినా కనిపించే పరిస్థితులు లేవు. అధికారుల పర్యవేక్షణలోనూ సమస్యలు కనిపించినా పరిష్కారాలు అంతంత మాత్రంగానే ఉన్నా యి. ఇప్పటికే రావాల్సిన ఈదురుగాలులు.. అకాల వర్షాలు ఒకరకంగా ఆలస్యమైనట్లుగానే రైతులు భావిస్తున్నారు. గత రెండు, మూడు రోజులు వాతావరణంలో మార్పులు కనిపించడం.. వర్షాలు, గాలులు రావడంతో రైతులు మరింత దిగులు చెందుతున్నారు.
15 రోజుల నుంచి సెంటర్లోనే ఉన్నాం. నాలుగు రోజుల కిందట సంచులు ఇస్తే తూకం చేసినం. 110 బస్తాలు అయ్యా యి. లారీల కోసం ఎదురు చూస్తు న్నాం. ఇప్పుడప్పుడు అంటున్నారు. లారీలు మాత్రం రావడం లేదు. వర్షాలకు ఇబ్బందులు పడుతున్నాం. మా సెంటరులోనే 4 లారీల బస్తాలు తూకం చేసినవి ఉన్నాయి. ఇంకా సంచులు లేక తూకం చేయాల్సిన ధాన్యం దండిగా ఉంది. అంతా అయోమయం.. గందరగోళం ఉంది. బజారున పడ్డట్టుగా యాసంగి రైతుల పరిస్థితి కనిపిస్తుంది.
– రామచంద్రయ్య, రైతు, పొలికెపాడ్, గోపాల్పేట్ మండలం