జడ్చర్లటౌన్, ఆగస్టు 13 : పంట పొలాల కోసం యూ రియా బస్తా కావాలంటే.. నానో యూరియా లిక్విడ్ బాటి ల్ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా.. లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా లిక్విడ్ బాటిల్‌ను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా జడ్చర్లలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో రైతులకు బలవంతంగా నానో యూరియా లిక్విడ్ బాటిల్‌ను అంటగడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
యూరియా బస్తాతోపాటు నానో యూరియా లిక్విడ్ బాటిల్ అంటగట్టి తమ నుంచి అదనంగా రూ.225 వసూలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఎన్నిసార్లూ యూరియా బస్తాలు కొన్నా.. దీనికి తోడుగా లిక్విడ్ బాటిల్‌ను అంటగడుతున్నారని, అవసరం లేకున్నా లిక్విడ్ బాటిల్ కొని ఏం చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క యూరియా బస్తా కొనేందుకు వచ్చిన తన నుంచి రూ.500లు వసూలు చేసి యూరియా బస్తాతోపాటు నానో యూరియా లిక్విడ్ బాటిల్‌ను అంటగట్టారంటూ రైతు బాలయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై విలేకరులు దుకాణ నిర్వాహకులను అడిగేందుకు వెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వం నుంచే మాకు లిక్విడ్ బాటిల్స్ సరఫరా అవుతున్నాయని, రైతులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో యూరియా లిక్విడ్ బాటిల్‌ను అమ్ముతున్నామని సమాధానమిచ్చారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి గోపినాథ్‌ను వివరణ కోరగా యూరియా బస్తాలతో పాటు కచ్చితంగా నానో యూరియా బాటిల్ అమ్మాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. రైతులు అడిగితే తప్పా బలవంతంగా లిక్విడ్ బాటిల్ అమ్మొద్దని.. దీనిపై విచారణ చేస్తామని వ్యవసాయాధికారి చెప్పారు.
మరికల్, ఆగస్టు 13 : గతంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి పోలీసుల పహారాలో యురియాను పంపిణీ చేసిన ఘటనలు మళ్లీ కాంగ్రెస ప్రభుత్వంలో పునరావృత్తం అవుతున్నాయి. బుధవారం మరికల్ మండలంలోని లాల్కోట చౌరస్తా వద్ద ఉన్న తీలేరు పీఏసీసీఎస్కు 350 బస్తాల యూరియా రావడంతో రైతులు యురియా కోసం చెప్పులను క్యూలో పెట్టారు. కోయిల్‌సాగర్ కింద వరి సాగును ఎక్కువగా సాగు చేస్తుండడంతో రైతులకు యూరియా అవసరం ఎక్కువగా ఉంది. రైతులకు ఎకరాకు ఆరు బస్తాల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం రెండు, మూడు బస్తాలే పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
ధన్వాడ, ఆగస్టు 13 : రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ధన్వాడ పీఏసీసీఎస్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. బుధవారం పీఏసీసీఎస్కు 200 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడినా అందరికీ అందకపోవడంతో విండో చైర్మన్ వెంకట్రామిరెడ్డితో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన జిల్లా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి మాట్లాడగా యూరియా అందుబాటు లో ఉన్నది పంపించామని, ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడాలన్నారు. గోటూరుకు చెందిన రైతులు తమకు ఎక్కువ బస్తాల యూరియా కావాలని కోరడంతో మళ్లీ రేపు యూరియా లోడ్ వస్తుందని, వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని చైర్మన్ వారికి నచ్చజెప్పారు.
భూత్పూర్, ఆగస్టు 13 : యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం తెల్లవారు జామునుంచే రైతులు పొలం పనులకు పోకుండా యూ రియా కోసం పీఏసీసీఎస్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్ర భుత్వం యూరియాను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా వి ఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యూరియా విషయంలో ఎన్నడూ ఇబ్బందులు పడ్డ దాఖలాలు లేవని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.