గద్వాల, జనవరి 25 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పో తున్నది. ఆదివారం అదును చూసుకొని అక్రమార్కులు ఏకంగా మార్కెట్ చుట్టూ నిర్మించిన రక్షణ గోడను పూర్తిగా కూల్చేశారు. అక్కడి వ్యాపారులు మార్కెట్ స్థలాన్ని కబ్జాచేసేందుకు ప్రయత్నాలు చేస్తూ మార్కెట్ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నా మార్కెట్, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు. కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నప్పటికీ మార్కెట్ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో పట్టణ ప్రజలు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదట పట్టణ నడిబొడ్డున ఉన్న వ్యవసాయ మార్కెట్కు ఆనుకొని ఉన్న సమయంలో మున్సిపల్ అధికారులకు తెలియకుండా, వారికి స మాచారం ఇవ్వకుండా అక్రమంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి డ్రైనేజీపై స్లాబ్ వేశారు. ఈ విషయం మార్కెట్, మున్సిప ల్ అధికారులకు ప్రజా సంఘాల నాయకులు ప్రజ లు ఫిర్యాదులు చేసినా, పత్రికల్లో వార్తలు వచ్చిన వారు పట్టించుకోకపోవడంతో ఏకంగా వ్యాపారులు మరో అడుగు ముందుకు వేసి ఆదివారం మార్కెట్ యార్డుకు రక్షణగా ప్రహరీని పూర్తిస్థాయిలో కూల్చివేశారు. దీంతో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది.
అనుకున్నదే అయింది. గద్వాల వ్యవసాయ మా ర్కెట్ స్థలంపై కన్నెసిన కొందరు వ్యాపారులు మొద ట డ్రైనేజీ నిర్మించారు. ఆతర్వాత మార్కెట్ రక్షణ గోడను కూల్చేశారు. స్టేషన్ రోడ్డువైపు దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత శాఖ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఆక్రమించుకున్నోడిదే రాజ్యం అన్నట్లు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ స్థలాలు ధ్వంసం చేసి నిర్మాణాలు చేయడానికి పూనుకుంటున్న సంబంధిత కలెక్టర్, మున్సిపల్, మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వ్యవసాయ మార్కెట్కు ఉన్న రక్షణ గోడను పూర్తిస్థాయిలో కూల్చి వేయడంతో రైతుల ధాన్యానికి భద్రత లేకుండా పోయింది.
అధికారుల,ప్రజాప్రతినిధుల అండ చూసుకొని కొందరు పెద్ద మనుషులు మార్కెట్ రక్షణ గోడ కూ ల్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే రక్షణ గోడ కూల్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే గతంలో మార్కెట్ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మార్కెట్ స్థలం అమ్మగా ప్రస్తుత మార్కెట్ అధికారులు అండ చూసుకొని షాపింగ్ కాంప్లెక్స్ ఏ ర్పాటు చేయడానికి వ్యాపారులు పూనుకుంటున్నా రు.
అప్పట్లో 26మంది వ్యాపారులకు వారి ఇంటి వెనుక ఉన్న స్థలాన్ని విక్రయించారు. ప్రస్తుతం అం దులో 10మంది కూడా వ్యాపారస్తులు వ్యాపారాలు చేయడం లేదు. వారు కూడా రక్షణ గోడ కూల్చి ని ర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టా రు. అక్కడ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో దుకాణా లు ఏర్పాటు చేస్తే నెలకు లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ వారు అలా చేకుండా అక్రమార్కులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ రక్షణగోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకొని రైతుల ధా న్యానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది.