అచ్చంపేట, ఏప్రిల్ 3 : నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిం చే సలేశ్వరం లింగమయ్య జాతర ఈసారి భక్తులకు తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ జాతరలో మౌలిక సదుపాయాలు లేమి కారణంగా భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వామివారి దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రధాన జాతరలకు నిధులు కేటాయిస్తూ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం సలేశ్వరం లింగమయ్య జాతర విషయంలో మాత్రం తగినంత శ్రద్ధ చూపలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫరహాబాద్ చౌరస్తా నుంచి గుండం వరకు భక్తుల ప్రయాణం కష్ట సాధ్యంగా మారింది. వాహనాల పార్కింగ్ నుంచి కాలినడకన వెళ్లే దారి వరకు ఆటోలు లేక ఇబ్బందులు భక్తులు పడ్డారు. ఎండ తీవ్రతకు తోడు తాగునీటి సౌకర్యం లేకపోవడం, మధ్యలో విశ్రాంతి కోసం టెంట్లు లేకపోవడం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు.
గుండంలోకి దిగడానికి, పైకి ఎక్కడానికి ఒకే మార్గం ఉండడంతో భక్తులు రద్దీలో చిక్కుకున్నారు. మెట్ల మార్గంలో సరైన వసతులు లేకపోవడం, రక్షణ కోసం బారికేడ్లు లేకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్గమధ్యంలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు, వసతులపై మాట్లాడడానికి కమ్యూనికేషన్ కోసం అధికారులకు వాకీటాకీలు లేకపోవడం, మైక్ అనౌన్స్మెంట్ సదుపాయాలు తగినంతగా లేకపోవడం మరోసమస్యగా మారింది.
భక్తులకు తాగునీటి కొరత, వైద్య సదుపాయాల లేమి వల్ల భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విధుల్లో ఉన్న సిబ్బందికి గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడ్ లేకపోవడంతో భక్తులు వారి సూచనలు పాటించడంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి.
అటవీ శాఖ ఫరహాబాద్ చౌరస్తా టోల్గేట్ వద్ద వాహనాల నుంచి రుసుములు వసూలు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టి భక్తులకు సదుపాయాలు కల్పించడంలో దృష్టి సారించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించినప్పటికి భక్తులకు పూర్తిస్థాయి సదుపాయాలు అందించడంలో విఫలమయ్యారు.
సలేశ్వరం లింగమయ్య జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా గుర్తించి ముందస్తుగా నిధులు కేటాయించి సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భద్రత, తాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు, రవాణా వంటి అంశాలలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.