నాగర్కర్నూల్, మే 28 : వరిధాన్యం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిలువుదోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ మార్క్ పాలన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మక్క ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాసిన రైతాంగానికి వరిధాన్యం విక్రయం మోయలేని భా రంగా మారింది. క్వింటా వరిధాన్యానికి మిల్లుర్లు 12 నుంచి 20కిలోల వరకు తరుగు తీస్తుండటంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం(పౌర సరఫరాల శాఖ) ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలు బూ టకంగా మారాయి. తరుగు తీయడంపైన ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారు. అంతిమంగా దోపిడీకి గురైన వరిధాన్యం పండించిన రైతుకు మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయి.
కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సౌకర్యం పెరిగిన నేపథ్యంలో నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగిలో దాదాపు 1.68లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగుచేశారు. సరాసరి 4.50లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారుల అంచనా. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో క్రమక్రమంగా వరిధాన్య కొనుగోలు బాధ్యతను పౌరసరఫరాల శాఖ తీసుకున్నది. వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలు గా పీఏసీసీఎస్, మహిళా సంఘాలు, మెప్మా వంటి సంస్థలకు కమిషన్ పద్ధతి న నియమించుకున్నది. వరిధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగించినందుకు సివిల్ సైప్లె శాఖ సదరు సంస్థలకు కమిషన్ ఇస్తుంది. ఇందుకు గానూ సదరు కమిషన్ సంస్థలు సివిల్ సైప్లె సమకూర్చిన గన్నీ బ్యాగులను రైతులకు ఇవ్వాలి, రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేసి.. రైతుకు రసీదు ఇచ్చి సదరు ధాన్యాన్ని మిల్లులకు చేరవేయాల్సి ఉంటు ంది. రైతులు విక్రయించిన ధాన్యం వివరాలను సివిల్సైప్లె శాఖకు అందజేయాలి. అప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం విక్రయించిన డబ్బులు జమ అవుతాయి.
ప్రసుత్తం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు బూటకంగా మారాయి. కేవలం గన్నీ బ్యాగులు ఇచ్చి కాగితాలు తారుమారు చేసి కమిషన్ తీసుకునే స్థాయికి వచ్చాయి. కల్లాల వద్దకు వెళ్లి ధాన్యాన్ని సేకరించే పనికి ఎప్పుడో సెలవు ఇచ్చారు. గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకుంటున్న రైతులు తాము పండించిన ధాన్యాన్ని సదరు సంచుల్లో నింపుకొని కొనుగోలు కేంద్రం సూచించిన మిల్లుకు ట్రాక్టర్ లేదా లారీలో సొంతంగా తీసుకుపోవాల్సి వస్తుంది. ధాన్యం మిల్లులో విక్రయించిన తర్వాత ఇచ్చిన రసీదులను సదరు కొనుగోలు కేంద్రంలో అందజేస్తాడు. రైతు ఇచ్చిన రసీదును సివిల్ సైరఫరాశాఖకు అందజేస్తుంది. విషయం ఏమిటంటే..అంతా రైతే చేసుకుంటే.. ట్రాన్స్పోర్టు చార్జీలను ఎవరు మింగుతున్నట్లు.
రైతుల నుంచి వరిధాన్యాన్ని సేకరించేందుకు సివిల్ సైప్లె శాఖ జిల్లాలో 31 మిల్లులకు అనుమతులు ఇచ్చింది.(సీఎంఆర్ ఇవ్వనందుకు జిల్లాలో చాల మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు) వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సివిల్ సైప్లె శాఖ అనుమతులు ఇచ్చిన మిల్లులకు పంపించాల్సి ఉంటుంది. మిల్లుకు చేరిన వెంటనే మిల్లర్ రైతు ధాన్యం తేమను పరిశీలించి శాంపిల్ తీసుకుని తన వద్ద ఉన్న మిషన్లో పోస్తాడు. అందులో ఉంచి బియ్యం బయటకు రాగానే వాటిని తూకం వేసి నాణ్యత తక్కువగా ఉందని డిసైడ్ చేసి రకరకాల కారణాలు చెబుతాడు. ప్రభుత్వానికి 68 శాతం బియ్యం ఇవ్వాలంటాడు. నీవు తీసుకువచ్చిన వడ్లు 60 శాతం కూడా రావని అంటాడు. తరుగుతీయడానికి ఒప్పుకుంటేనే వడ్లు తీసుకుంటానని షరతు విధిస్తాడు. రైతుకు ఏం పాలుపోని పరిస్థితి వస్తుంది. వెంటనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకునికి ఫోన్ చేస్తాడు. మేము ఏం చేయలేమని చేతులెత్తేస్తారు. తిరిగి ధాన్యాన్ని వెనక్కి తీసుకుపోలేని రైతు తరుగుకు ఒప్పు కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. తరుగు క్వింటా వడ్లకు 12 కిలోల నుంచి 20 కిలోల వరకు తీస్తున్నారు.
మూడు రోజుల కిందట నాగర్కర్నూల్ ప్రజావాణిలో ఊర్కొండ మండలానికి చెందిన ఓ రైతు ఫిర్యాదు చేశారు. తాను తీసుకుపోయిన వడ్లకు మిల్లర్ పెద్ద ఎత్తున తరుగు తీశారని వివరాలను అధికారులకు ఇచ్చారు. జిల్లాలోని అన్ని మిల్లులలో ఆదే జరుగుతుంది. అయినా ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు మాట్లాడిన పాపాన పోలేదు. దారుణంగా తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే.. ఎందుకు స్పందించడం లేదని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం కొనుగోళ్లలో సరాసరిన తరుగు లెక్కిస్తే.. 4 లక్షల కింటాళ్లకు పైగా తరుగు రూపంలో రైతుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. డబ్బు రూపంలో లెక్కిస్తే రూ.100 కోట్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
వడ్ల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున్న తరుగుతీయడంపై బీఆర్ఎస్ నాయకులతోపాటు రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున కోత తీస్తుంటే.. ప్రభుత్వం, అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మార్పు అంటూ తాసీల్దార్ చెప్పినా తరుగు తీశారు తరుగు తీస్తున్నందున్న తమ బంధువైన తాసీల్దార్తో చెప్పించినా.. వడ్లను పూర్తి స్థాయిలో ఎండబెట్టి తీసు కెళ్లినా క్వింటాకు 8 కిలోల తరుగు తీశారు. లేకుంటే తీసుకెళ్లిపోవాలని చెప్పారు. రెండు ఎకరాల్లో వరి సాగుచేస్తే.. 60 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాన్ని సంప్ర దించి గన్నీ బ్యాగులు తీసుకొని ట్రాక్టర్లో ఒడ్లు తీసుకుని వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి సమీపంలోని మిల్లుకు తీసు కుపోతే కోత విధించారు. ఇక సామాన్య రైతులతో క్వింటాలుకు 12 నుంచి 20 కిలోల వరకు తీస్తున్నారని రైతులు చెబుతుండ్రు. ఇదే దోపిడీ.
– చిమ్ముల వెంకట్రెడ్డి, సిలార్పల్లి, కల్వకుర్తి మండలం
తరుగు పేరుతో రైతులను అన్యాయం చేస్తున్నారు. తెలకపల్లి మండలంలో ఒక బస్తాలో 41 కిలోల వడ్లను తూకం వేసి 2 నుంచి 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. నాణ్యతతో కూడిన వడ్లకు కూడా క్వింటాలుకు 6 నుంచి 8 కిలోల తరుగు తీయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. తరుగు విషయంలో స్పష్టత లేకుండా కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
– శ్రీనివాసులు, రైతు, చిన్నముద్దునూరు