వనపర్తి, ఆగస్టు 29 : వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో దశాబ్దాలపాటు కలగా ఉన్న పనులను సైతం చేపడుతున్నారు. కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్న రోడ్ల విస్తరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మెడికల్, ఇంజినీరింగ్, పీజీ, నర్సింగ్, మత్స్య, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలను నెలకొల్పారు. టీ హబ్, పాలియేటివ్ కేర్ సెంటర్, క్యానర్స్ నిర్ధారణ, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేసి వైద్యాన్ని ప్రజలకు చేరువచేశారు. ఇలా ప్రతి రంగంలోనూ దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, యువకులు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. నిత్యం మంత్రి సమక్షంలో వందలాది మంది గులాబీ గూటికి చేరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాయకులు లేక ఖాళీ అవుతున్నాయి. కారుగుర్తుకే ఓటేస్తామంటూ మూకుమ్మడిగా నినాదాలు చేస్తున్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి రోజుకు వందల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల నాయకులు స్వచ్ఛందంగా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వారికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రతి రోజూ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుతున్నారు. మంత్రి వనపర్తి క్యాంపు కార్యాలయానికి వచ్చినా, అభివృద్ధి పనుల నిమిత్తం పల్లెలకు వెళ్లినా, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినా బీఆర్ఎస్లోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. దీనంతటికి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి ఒక కారణమైతే.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మంత్రి నిరంజన్‌రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు దశాబ్దాల కల అయిన రోడ్ల విస్తరణ చేపట్టారు. దీంతో హైదరాబాద్, ఖిల్లా ఘణపురం, కొత్తకోట రహదారుల విస్తరణ పూర్తవగా పాన్‌గల్ రహదారుల పనులు 90శాతం, పెబ్బేర్ రహదారి పనులు మమ్మురంగా కొనసాగుతున్నాయి.
అదేవిధంగా జిల్లాకు మెడికల్, ఇంజినీరింగ్, పీజీ, నర్సింగ్, మత్య్స, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరు కాగా ప్రారంభించుకోవడం జరిగింది. వైద్య రంగంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం, టీ హబ్, పాలియేటివ్ కేర్ సెంటర్, క్యానర్స్ నిర్ధారణ కేంద్రం, డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. వనపర్తి జిల్లాగా మారిన తర్వాత రైతులకు అన్ని వసతులతో కూడిన మార్కెట్ యార్డును చిట్యాల వద్ద నిర్మించి ప్రారంభించారు. సమీకృత మార్కెట్, టౌన్ హాల్ కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. పట్టణానికి నాలుగు దిక్కులా ఉన్న చెరువులను పునరుద్ధరించి మినీట్యాంక్ బండ్‌గా మార్చి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ఇలా దశల వారీగా అభివృద్ధి జరుగుతున్నాయి. గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచి నామమాత్రపు పనులతో వాళ్ల పదవులను కాపాడుకొని అభివృద్ధి విస్మరించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామాలు, వార్డుల్లో పల్లె నిద్ర చేపట్టి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. నిరంతరం తమకు అందుబాటులో ఉంటున్న మంత్రికి తామంతా అండగా ఉండాలని భావించి గులాబీ గూటికి వలసొస్తున్నట్లు ఇతర పార్టీల నాయకులు చెబుతున్నారు.
అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుంది..
2014 ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ప్రజా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిన సమయంలో 2018లో నియోజకవర్గ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు భారీ మెజార్టితో ఆయనను గెలిపించారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా, వ్యవసాయశాఖ మంత్రిగా నిరంజన్‌రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంతా పట్టణ, గ్రామాల ప్రజల కండ్లకు కనిపిస్తున్నది. దీంతో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని భావించే వారంతా మేము సైతం సంక్షేమం వైపు ఉంటామంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారనడానికి చేరికలే ఉదాహరణ అని నమ్ముతున్నా..
– గట్టు యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
మూడు దశాబ్దాల అభివృద్ధి మంత్రి సారథ్యంలో..
ఊహ తెలిసినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోదగిన అభివృద్ధి జరుగలేదు. ఎన్నికల్లో గెలిచిన మొదటిసారే వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తితోపాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉంచారు. మూడు దశాబ్దాలుగా జరుగని వనపర్తి అభివృద్ధిని, కేవలం తొమ్మిదేండ్లల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, మంత్రిగా ఉండి చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ జిల్లా మాజీ కన్వీనర్‌గా పదవి లభించింది కానీ అభివృద్ధి చేయలేకపోయా. అందుకనే మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరా. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి నడుం బిగించారు. పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా..
– కొమ్ము చెన్నయ్య, బీఆర్ఎస్ నాయకుడు, దొడగుంటపల్లి, పెద్దమందడి మండలం
అభివృద్ధిలో భాగస్వామినవ్వాలని..
గతంలో నేను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీలో బాధ్యతలు నిర్వర్తించా. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గం మొత్తం వేగంగా అభివృద్ధి చేందుతున్నది. ముఖ్యంగా వనపర్తి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నది. ఇలాంటి పార్టీ వెంట నేను సైతం ఉండి మంత్రి చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ ప్రజలకు సేవచేయాలనుకున్నా. ఇటీవల మా కుటుంబసభ్యులు, వార్డులోని ప్రజలతో కలిసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరా.
– క్రాంతిగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు, వనపర్తి