మక్తల్ : నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ( Kodangal Lift Irrigation ) పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న కాట్రేపల్లి( Katrepalli), ఎర్నాగానిపల్లి( Ernagani Pally) రైతులు అధికారుల ఎదుట సంతకాలను నిరాకరించారు. ఎకరాకు రూ.70 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే భూములిస్తామని మరోమారు స్పష్టం చేయడంతో ఆర్డీవో రాంచంద్రనాయక్, రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు.
గురువారం మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామంలో నారాయణపేట ఆర్డీవో రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా రైతులందరికీ పరిహారం అందిస్తామని, రైతులు భూసేకరణ సర్వేకు సహకరించి, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అయితే రైతులు ససేమిరా అన్నారు ప్రభుత్వం కాట్రేపల్లి గ్రామాన్ని ఆర్ఆర్ సెంటర్‌గా ప్రకటించి, ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 70 లక్షల పరిహారం , ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
దీంతో అధికారులు సమావేశాన్ని ముగించి ఎర్నాగానిపల్లి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇక్కడి రైతులు సైతం రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ కుమార్, నేటి పరిధాల శాఖ అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.