కడ్తాల్, డిసెంబర్ 21 : మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, సుభాష్ పత్రీజీ కలలను సాకారం చేసేందుకు ప్రతి ధ్యాని కృషి చేయాలని పిరమిడ్ ట్రస్టు చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలో గల కైలాసాపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో గురువారం సాయంత్రం పత్రీజీ ధ్యాన మహాయాగం-2 ధ్యాన మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పదకొండు రోజులపాటు జరిగే ధ్యాన మహాయాగం సభలను, పత్రీజీ కుమార్తెలు పరిమళ, పరిణీతతో కలిసి పిరమిడ్ ట్రస్టు సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి విజయభాస్కరెడ్డి మాట్లాడుతూ సుభాష్ పత్రీజీ ధ్యాన గురువని, ఆయన చూపిన ధ్యాన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.
ధ్యాన సభలకు వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు హాజరయ్యారు. ధ్యాన సభల ప్రారంభోత్సవం సందర్భంగా కళాకారుల నృత్యాలు విశేషంగా అలరించాయి. అంతకుముందు పత్రీజీ శక్తిస్థల్ని ట్రస్టు సభ్యు లు, ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు, దామోదర్‌రెడ్డి, రాంబాబు, హనుమంతురాజు, శివప్రసాద్, కృష్ణారెడ్డి, రాజశేఖర్, చంద్రశేఖర్, మాధవి, లక్ష్మి, జెడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, అన్మాస్‌పల్లి సర్పంచ్ శంకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు పాల్గొన్నారు.