గద్వాల, అక్టోబర్ 24 : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్ వేమూరి కావేరి బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రమాద ఘటన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి బెంగూళూరుకు బయలు దేరిన కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 41మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలిసిందన్నారు.
ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. వైద్య సిబ్బంది బస్‌లోని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ దవాఖానతోపాటు పలు ప్రైవేట్ దవాఖానలకు చికిత్స నిమిత్తం తరలించి వారికి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికను బట్టి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందన్నారు. బస్సులో 13మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది ఇతర రాష్ర్టాల నుంచి మిగతా వారు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.
కర్నూల్ జిల్లా యంత్రాంగానికి జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గద్వాల జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూం నెంబర్ 9502271122, పోలీస్ కార్యాలయ కంట్రోల్‌రూం నెంబర్ 8712661828, కర్నూల్ ప్రభుత్వ జనరల్ దవాఖాన కంట్రోల్ రూం నెంబర్ 9100901604 ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.