జోగులాంబ గద్వాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల సందర్శన నిరాశపరిచిందని బీఆర్ఎస్ ( BRS ) నియోజకవర్గ ఇన్చార్జ బాసు హనుమంతు నాయుడు ( Basu Hanmanth Naidu ) ఆరోపించారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి వస్తే న్యాయం జరుగుతుంది. అభివృద్ధికి నిధులు మంజూరవుతాయని ఎదురుచూసిన ప్రజలను సీఎం నిరాశపరిచారని విమర్శించారు. గుడ్డెందొడ్డి పంపు హౌస్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి , అక్కడ ఏర్పాటుచేసిన వీడియో ప్రజెంటేషన్‌ను పూర్తిస్థాయిలో చూడకుండానే మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో నడిగడ్డపై సీఎంకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి పర్యటన టూరిస్టులా ఇలా వచ్చి , అలా వెళ్లినట్టు ఉన్నది ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే పర్యటించారని, నిధులు, అభివృద్ధిపై కాదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించకపోవడం విచారకరమని అన్నారు. గతంలో కూడా కేబినెట్ మంత్రులు టూరిస్ట్ లాగా వచ్చి పోయారు తప్ప,నిధులు మాత్రం మంజూరు చేయలేదని పేర్కొన్నారు. 25 నిమిషాల ముఖ్యమంత్రి పర్యటనలో ఫోటోలు దిగేందుకే ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు.
నియోజకవర్గంలో పిల్ల కాలువలో పెరిగిన చెట్లను తొలగించలేని స్థితిలో ప్రభుత్వము ఉన్నదని అన్నారు. నిలిచిపోయిన గట్టు ఎత్తిపోతల పథకం పనులుపై ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై మండిపడ్డారు.
ఈ సమావేశంలో నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి, అల్లపాడు ప్రతాప్, బీచుపల్లి, వెంకటేష్ నాయుడు,చక్రిధర్ రెడ్డి,శేఖర్ నాయుడు, జాంపల్లి భరత్ సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, డ్యామ్ శ్రీను, ఆంజనేయులు, వెంకట్, తిమ్మప్ప, సవారీ,వీరేష్, రాజు, నరసింహులు, గోవిందు, అంజి, తదితరులు పాల్గొన్నారు.