వనపర్తి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి గడువు పెంచి అవకాశం ఇచ్చినా.. పెండింగ్ పూర్తి కాలేదు. చివరకు రెండోసారి అవకాశం ఇచ్చిన గడువు కూడా రేపటితో ముగియనున్నది.
ఇప్పటికే 2024-25కు సంబంధించి వానకాలం, యాసంగిలో ఇంకా లక్షా 27 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. గడిచిన మూడు, నాలుగేండ్ల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు అందినకాడికి ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పని చేసిన అధికారులు.. అవినీతికి కేరాఫ్‌గా నిలిచి మిల్లర్లతో చేతులు కలపడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టినట్లు తెలిసింది.
వనపర్తి జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ధాన్యం వ్యవహారం క్రమ పద్ధతిలో కొనసాగడం లే దు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు అయిన వారికి ఒకలా.. కాని వారికి మరోలా కొనసాగుతున్నాయి. వడ్ల కేటాయింపులు మొదలుకొని తిరిగి బియ్యం లేవి పెట్టడం వరకు అనేక రకాల వ్యవహారాలు పౌరసరఫరాల శాఖలో రాజ్యమేలుతున్నాయి. ప్రస్తుతం 2024-25కు సంబంధించి వానకాలంలో 1.43.149 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 57 రైస్ మిల్లులకు కేటాయించారు. యాసంగిలోనూ 2.66.084 మెట్రిక్ టన్నులు వరి కొనుగోలు చేయగా, 77 రైస్‌మిల్లులకు కేటాయించారు. కాగా, జిల్లాలో 180 మిల్లులు ఉండగా వీటిలో అర్హత ఉన్న వాటికి మాత్రమే కేటాయింపులు చేశామని చెబుతున్నా.. ఇది వాస్తవం కాదన్న గుసగుసలున్నాయి.
వానకాలం సీజన్‌కు సంబంధించి వడ్లను కేటాయించిన మిల్లుల నుంచి 96,166 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉన్నది. వీటిలో ఇప్పటి వరకు 69, 646 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే లేవి పెట్టారు. ఇంకా ఖరీఫ్‌కు సంబంధించి 27,209 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల నుంచి రావాల్సి ఉంది. అలాగే యాసంగి పరంగా చూస్తే.. 2 లక్షల 34,398 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించారు. ఇందుకు లక్షా 57,796 మెట్రిక్ టన్నుల బియ్యం లేవి పెట్టాలి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 69,646 టన్నులు మాత్రమే మిల్లర్లు సర్కారుకు ఇవ్వగా, లక్షా 7,292 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. ఇలా రెండు సీజన్లకు కలిపి లక్షా 27 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది.
ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ ఇలా ప్రతి ఏటా ఎందుకు పెండింగ్ పడుతుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇది ప్రతి సంవత్సరం కొనసాగే తంతుగా కనిపిస్తుంది. తప్పులు చేసేదాకా చూస్తూ ఉండే అధికారులు కంటితుడుపుగా చర్యలు తీసుకోవడంతో ఏడాదికేడాది సీఎంఆర్‌ను బకాయి పడే రైస్ మిల్లర్ల సంఖ్య పెరుగుతున్నది. జిల్లాలోని పలువురు మిల్లర్లు వారికి కేటాయించిన ధాన్యాన్ని మిల్లాడించి సకాలంలో బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇలా జిల్లాలో మూడు నుంచి నాలుగు సీజన్ల వరకు బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లున్నారు.
వీరికి అనేక దఫాలు గడువులిచ్చినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో ఇలా బకాయిపడ్డ మిల్లులకు ధాన్యం కేటాయించకూడదని నిబంధనలున్నా.. అంతా తూచ్ అన్నట్లుగానే సాగుతున్నది. చిన్న చేపను.. పెద్ద చేప మింగినట్లుగా కేవలం చిన్న యజమానులపైనే చర్యలన్నట్లుగా ఉంది. ఈ ఏడాది కూడా గతంలో బకాయిలున్న వారికి ధాన్యం కేటాయింపులు ఇవ్వకూడదని నిబంధనలున్నా.. వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు లేకపోలేదు. కాగా, మిల్లర్స్ అసోసియేషన్లు అయిన వారికే ఆసరా అన్నట్లు కూడా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
2024-25 వానకాలంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన గడువును రెండో దఫా పొడిగించింది. మొదటి గడువుగా మే 31ని నిర్ణయించగా మిల్లర్లు చాలా వరకు లేవి పెండింగ్‌లో ఉంచారు. దీనిపై రెండో దఫాలో సెప్టెంబర్ 12 వరకు మిల్లర్లకు గడువు పొడగిస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అయినా ఇంకా మిల్లర్లు ప్రభుత్వానికి లేవి క్లియర్ చేయకుండా పెండింగ్‌లోనే ఉంచారు. ఇలా గడువులు విధించడం మామూలే అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతున్నది. మిల్లులో జరిగే తతంగం అధికారులకు తెలుసు.. అధికారుల సంగతి మిల్లర్లకు తెలుసు అన్నట్లుగా రైస్ మిల్లర్ల లేవి వ్యవహారం జిల్లాలో ఓతంతుగా సాగుతున్నది. గడచిన మూడు, నాలుగేండ్లలో ఇక్కడి సీఎంఆర్‌కు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర స్థాయిలో అవినీతి పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.