నారాయణపేట/గద్వాల/కొల్లాపూర్/ఊట్కూరు, జూన్ 4 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా తొలి రోజు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన మమ అనిపించింది. బెంగళూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌కు కర్ణాటక మంత్రి బోసు రాజుతో కలసి నేరుగా ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకి టి శ్రీహరి ఉన్నారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న మక్తల్ సమీపంలో నారాయణపేట-కొడంగల్ ఎతిపోతల పనులను పరిశీలించారు.
ఈ పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రేవంత్ తెలిపారు. కొడంగల్ ఎత్తిపోతల ప్యాకేజీ-1 పనులను పరిశీలించి జరుగుతునన్న పంప్‌హౌస్ పనులు ఎంత శాతం పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు తిరుగు పయణమయ్యారు. గంట సమయంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు, మ్యాపుల పరిశీలనలు, ఫొటో ఎగ్జిబిషన్ల సందర్శనలు, కార్యకర్తలతో ఫొటోలు, అధికారులతో వాకబు చేశారు. మక్తల్ పర్యటన ఆధ్యంతం పోలీసు నిర్భంధంలోనే సాగింది. ప్రజలకు అందుబాటులో లేకుండా సీఎం కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లాకు చేరుకొన్న ముఖ్యమంత్రికి జూరాల, నెట్టెంపాడ్, ర్యాలంపాడ్, గట్టు ఎత్తిపోతల, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల నీటి సామర్థ్యం, ఆయకట్టు పనుల పురోగతిపై సీఎంకు జూరాల ఎస్ఈ రహీముద్దీన్ వివరించారు. అనంతరం గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అయితే సీఎం పూర్తి స్థాయిలో వీడియో ప్రజెంటేషన్ చూడకుండానే మధ్యలోనే లేచి వెళ్లి పోవడంతో నడిగడ్డపై సీఎంకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని స్థానికులు విమర్శలు చేశారు.
ప్రాజెక్టుల పురోగతి, సమస్యలు వివరించాల్సిన అధికారులను (కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ ఎస్ఈ)లను వెనుక కూర్చోబెట్టి.. ముందు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి వీడి యో ప్రజెంటేషన్ సీఎం తిలకించడం ఇక్కడి అధికారులను అవమాన పర్చినట్లు అయ్యిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన టూరిస్టులా ఇలా వచ్చి.. అలా వెళ్లినట్లు ఉంది. సాయంత్రం పాలమూరు పథకం పనులను పరిశీలించేందుకు కొల్లాపూర్ మండలం సోమశిలకు సీఎం చేరుకున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సాగునీటి ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.