అమరచింత, జూలై 26 : మక్తల్ నియోజకవర్గంలోని రైతులందరూ ఏటా రెండు పంటలు పండించేందుకు మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి జీవత ఆశయమైన భూత్పుర్ రిజర్వాయర్‌ను తాను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నానని, మాటలు తప్పా చేతల్లో చూపని సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల కోసం మక్తల్‌ను ఎడారిగా మారుస్తారా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం డీపీఆర్ కూడా లేకుం డా పైపులైన్ పనులను మొదలు పెట్టి ఇప్పటికే రూ.వంద కోట్ల నిధులకు టెండర్లు వేయడం ఏమిటో అర్థం కావడం లేదని ఆరోపించారు. శనివారం అమరచింత శివారులోని ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిత్యం వహించే కొడంగల్ ప్రాంత రైతుల మొప్పుకోసం భూత్పుర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తే మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాలు ఎడారిగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని అడ్డగోలుగా ఉన్న అర్థంకాని శాఖలను తనకు అప్పగించారని గగ్గోలు పెడుతున్న మంత్రి వాకిటి శ్రీహరికి ఈ విషయం తెలిసినా మంత్రి పదవి కోసం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులను ఇబ్బందులకు గురి చేసి బీఆర్ఎస్ చూస్తు ఉరుకోదని రైతులతో కలిసి ఉద్యమం లేవదిస్తుందని అందుకోసం ఇప్పటినుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీల వైఫల్యాలను ప్రజల ముందుంచి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఎవరికి అవకాశం వచ్చినా వారిని గెలుపించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి మార్కె ట్ కమిటీ చైర్మన్ రాజు అధ్యక్షత వహించగా కార్యక్రమంలోఓ అమరచింత మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మంగ మ్మ, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, బీఆర్ఎస్ ఆత్మకూర్ మం డల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, అమరచింత మం డల అధ్యక్షుడు రమేశ్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, ప్రధాన కార్యదర్శి చిన్నబాలరాజు, బీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, వనపర్తి జిల్లా కన్వీనర్ తోకలి రమేశ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లెనిన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్, జాగృతి మక్తల్ నియోజకవర్గ కన్వీనర్ సయ్యద్ కలాంపాషా, పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలుతోపాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.