వనపర్తి అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : బీడుగా మారిన పొలాలకు సాగునీటిని తీసుకొచ్చి నీళ్ల నిరంజనుడిగా పేరొందారు మంత్రి నిరంజన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం లో నిత్యం కరవు కాటకాలతో అల్లాడిన ప్రజలు నేడు సంబురంగా సాగు చేసుకుంటున్నారు. తొమ్మిదేండ్లలోనే మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సాగునీటి వసతులను కల్పించడంలో పట్టువదలని విక్రమార్కుడిలా పని చేస్తున్నారు. సాగునీటితో పాటు విద్యా,వైద్యం,అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి వనపర్తి రూపురేఖలు మారిపోయాయి. నిత్యం ట్రాఫిక్‌తో తంటాలు పడే ప్రజలకు విశాలవంతమైన రోడ్లు నిర్మించి ప్రయాణికుల కష్టాలు తీర్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు వస్తున్నారు. దీంతో గులాబీ పార్టీలో మరింత జోష్ పెరిగింది.
ఇప్పటికే విద్యాభివృద్ధిలో కీలకంగా నిలిచిన వనపర్తి కొత్త రాష్ట్రంలో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకుపోతున్నది. వనపర్తి, గోపాల్పేట, ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపురం, రేవల్లి, వీపనగండ్ల, పాన్‌గల్, చిన్నంబాయి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎంజీకేఎల్ఐతోపాటు బీ మా ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సాగునీరందించేలా చర్యలు చేపట్టా రు. దీంతో నేడు జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చనిపంటలు కనిపిస్తున్నాయి. గతంలో జూరాల ప్రాజెక్టు ద్వారా మాత్రమే జిల్లాలోని కొంత భాగానికి సాగునీరందించే వెసలుబాటున్నది. ఇప్పుడా పరిస్థితుల నుంచి జిల్లా పూర్తిగా గట్టెక్కింది. ప్రస్తుత వానాకాల సీజన్లో దాదాపు లక్షా 86వేల ఎకరాల్లో ఒక్క వరి సాగే చేశారు.
జిల్లా పరిధిలో ఉన్న 14 మండలాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతున్నది. వీటిలో ఒక్కో మండలానికి రెండు ప్రాజెక్టుల నీటి వసతులు కూడా ఏర్పాటయ్యాయి. గతంలో ఒక్క పెబ్బేరు మండలంలో కొంత భాగం జూరాల కాల్వ ద్వారా నీటి వసతి తప్పితే మిగితా ప్రాంతమంతా భూములు బీడుబారి ఉండేవి. ఐదేండ్లలోనే ఎంజీకేఎల్ఐ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పుష్కలంగా సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. మరికొన్ని మండలాలకు బీమా ప్రాజెక్టు ద్వారా నీరొచ్చేలా చేశారు. అలాగే జిల్లా పరిధిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ద్వారా నీటి వసతి చేకూరింది. కొత్తకోట, మదనాపురానికి బీమా, ఎంజీకేఎల్ఐ సాగునీటిని అందించడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సఫలీకృతమయ్యారు. మక్తల్ పరిధిలోని రెండు మండలాలకు జూరాల ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సాగునీరందించడంలో కృషి చేశారు.
తొమ్మిదేండ్లలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వనపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయించుకోవడంలో మంత్రి సింగిరెడ్డి పాత్ర ఎంతో ఉన్నది. నూతన కార్యాలయాలను నిర్మించడంలో మంత్రి కీలకంగా వ్యవహరించారు. అలాగే మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసి తక్కువ సమయంలో అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతానికి అవసరమైన పనులన్నీ కూడా సీఎం కేసీఆర్ మంజూరు ఇవ్వడంతో తిరుగులేకుండా పోయింది. బీఎస్సీ నర్సింగ్ కళాశాల, అగ్రికల్చర్ బీఎస్సీ, మత్స్య కళాశాల ఇలా ఉన్నత విద్య కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా చేయడమే కాకుండా పేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. దశాబ్దాల తరబడి పట్టణవాసులు ఎదురుచూసిన రోడ్ల విస్తరణ సైతం మంత్రి పట్టుబట్టి చేయించడంతో జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోయాయి. సెంటర్ లైటింగ్‌తోపాటు పచ్చదనం ఉట్టిపడేలా రోడ్లను తీర్చిదిద్దారు. నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు, టౌన్‌హాల్, మదర్ అండ్ కేర్ సెంటర్, వే సైడ్ మార్కెట్, క్రిటికల్ కేర్ యూనిట్ తదితర అనేక పనులను మంజూరు చేయించి పూర్తి చేశారు.
వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గ సాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించి సక్సెస్ అయ్యారు. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజలకు అవసరమైన పనులను చేయించడంలో నిమగ్నమై పనిచేశారు. అదే స్ఫూర్తితో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే భారీ మెజార్టీని సింగిరెడ్డికి ఓటర్లు ఇచ్చారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అలుపు లేకుండా అభివృద్ధి పనులను చేపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో నాడు సీఎం కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మరోసారి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని గెలిపించే దిశగా ఓటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. వనపర్తి నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు మరికొన్ని అభివృద్ధి పనులను తీసుకెళ్లి హామీ పొందాలని మంత్రి సింగిరెడ్డి పనుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సైతం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరోసారి ఎన్నికల సభలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తారని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసంతో ఉన్నారు.