కోయిలకొండ, అక్టోబర్ 20 : కాంగ్రెస్‌కు ఓటేస్తే 24 గంటల కరెంట్ పోయి.. 3 గంటలే వస్తుందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని జయనగర్తండా, దమాయపల్లి, గార్లపహాడ్, శేర్పల్లి, అభంగపట్నం, కానాయపల్లి, గంగ్యానాయక్ తండాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ణాటకలో సరిపడా కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇప్పుడు మోసం చేశారంటూ మండిపడ్డారు. 6 గంటల కరెంట్ కూడా రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారన్నారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెబుతున్నారన్నారు.
రూ.200 ఉన్న పింఛన్‌ను సీఎం కేసీఆర్ రూ.2 వేలు చేశారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’ అద్భుతం అని అన్నారు. మండలంలోని ప్రధాన రోడ్లను డబుల్ బీటీ రహదారులుగా మర్చామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోయిలకొండ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, ఇక్కడి భూముల ధరలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో పేట సమన్వయకర్త రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సర్పంచులు హన్మంతు, మాధవిరెడ్డి, ఆంజనేయులు, ఎంపీటీసీ విజయలక్ష్మి, నాయకులు భీంరెడ్డి, రవి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.