నాగర్‌కర్నూల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ రాజ్యమంటున్న కాంగ్రెస్ పాలనలో రక్తపాతం, మతకల్లోలాలు, ఎన్కౌంటర్లు జరిగాయని, దళారీల రాజ్యంతో లంచాలు లేనిదే పని జరగలేదని, చావుకు తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మంచిగ నడుస్తుందని, ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్యని, ఊర్లల్లో చర్చపెట్టి ఆలోచించి తెలంగాణను మంచిగ నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీనే మళ్లా ప్రజలు గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ శివారులో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన ప్రజాఆశీర్వాదసభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 75 ఏండ్ల స్వాతం త్య్రం తర్వాత కూడా దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశించినంత పరిణతి చెందలేదన్నారు. ఎన్నికలు వస్తయి, పోతాయని, 30న ఎన్నికలు వస్తయి, 3న లెక్కిస్తరు, ఎవరో గెలుస్తరు, ఓడుతరు…అంతటితో అది అయిపోదు, గెలిచినోళ్లు ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఆ ప్రభుత్వం ఐదేండ్లు మన జాతకాలను రాస్తుందన్నారు. ఎవరిని గెలిపించాలో ఆలోచించాలని, గ్రామాల్లోకి వెళ్లాక ప్రజల మధ్య చర్చ జరపాలన్నారు. రాయేదో, రత్నమేదో, మంచేదో, చెడోదో గుర్తు పట్టాలన్నారు.
ఓ కుండను కూడా కొట్టి చూస్తమని, కూరగాయలు కొంటే పుచ్చులు ఏరి మంచిదే కొన్నట్లుగా ఎమ్మెల్యేను ఎన్నుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.బీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి నిలబడ్డారని, కాంగ్రెస్, బీజేపీలతోపాటుగా ఇండిపెండెంట్లూ ఉంటారని, ఇందులో ఎవరు గెలిస్తే ఏం చేస్తరో, నడవడిక ఎలాంటిదో ఆలోచించాలని, ఆ వ్యక్తుల వెనుక ఉన్న పార్టీల గురించి, ఆ పార్టీల చరిత్ర గురించి కూడా గుర్తు పెటుకొని ఓటేస్తే లాభం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే వజ్రాయుధంలాంటి ఓటు హక్కును మంచికి ఉపయోగించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ రాష్ట్రం కోసమన్నారు. చాలా కష్టపడి రాష్ర్టాన్ని సాధించామన్నారు. ఈ పదేండ్లుగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నామని, అంతకుముందు నాగర్‌కర్నూల్, పాలమూరు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిందన్నారు. గతంలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. మంచినీళ్లు, కరెంట్, సాగునీళ్లకు నోచుకోలేదన్నారు. బొంబాయికి వలసలు, చేనేతలు, రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా గతంలో పరిపాలించారన్నారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కలిపారని, 459మందినికాల్చి చంపారని, 2001లో మనం ఉద్యమం చేస్తే 2004లో పొత్తు కలిస్తే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పి మోసగించిందన్నారు.
పద్నాలుగు, పదిహేనేండ్లు సతాయించినంక, చివరికి కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రనా, తెలంగాణ జైత్రయాత్రనా అని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రకటన చేసి వెనక్కు పోయారని, పార్టీని చీల్చే ప్రయత్నం చేశారన్నారు. బస్సులు బందు పెట్టాం, రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తే, దేశంలో 33 పార్టీలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ వచ్చాక కొత్తకుండలో ఈగ సచ్చినట్లు, కొత్త సంసారం, ఏం జేయాలో తెల్వదు, ఆర్థిక నిపుణులతో మాట్లాడి ఒక లైన్ పట్టామన్నారు. పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ హయాంలో ఉన్న పింఛన్ రూ.200ను సమాజంలో విధివంచితులైన వృద్ధులు, వితంతులు, వికలాంగులకు రూ.1000, ఆ తర్వాత రూ.2000, రేపు గెలిచాక రూ.5వేలు చేసుకుంటున్నామన్నారు. కంటి వెలుగు పథకం కింద 3కోట్ల మందికి కంటి పరీక్షలు, దాదాపుగా 80లక్షల మందికి కళ్లద్దాలు అందించినట్లు చెప్పారు. అమ్మఒడి వాహనాల్లో ప్రసవాలు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు 50శాతానికి నూలు, రంగులు ఇస్తున్నామన్నారు. ముదిరాజ్ బిడ్డలకు రూ.33వేల కోట్ల చేపలు ఎగుమతి అయ్యాయని, లక్షలాది గొర్రెలను యాదవులకు పంపిణీ చేశామని గుర్తు చేశారు.
రైతులకు ప్రాజెక్టులకు కాల్వల ద్వారా నీళ్లు పారితే పన్నులు ఉంటాయని, రాష్ట్రంలో ఏ పన్నూ లేదని, పాత పన్నులు రద్దు చేశామన్నారు. 24గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని, పెట్టుబడికి వడ్డీలు, మిత్తీలు తేకుండా రైతుబంధు సాయం ఇస్తున్నామన్నారు. చనిపోయిన రైతులకు రూ.5లక్షల బీమా ఇస్తున్నామన్నారు. ఇవన్నీ మీ కళ్ల ముందున్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మన్నుండెనా.. ఆకలి చావులు చస్తే, ఎన్టీఆర్ వచ్చాక రూ.2కే కిలో బియ్యం పెట్టారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మనోళ్లను కాల్చి చంపారని, రక్తం ఏరులై కారిందని, మతకల్లోలాలు జరిగాయన్నారు. ప్రజలు కట్టిన పన్నులను రైతుబంధుగా వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఇది వేస్టా అని ప్రజలు చెప్పాలన్నారు. రైతుబంధు ఉండడమే కాదు, అది రూ.16వేలు చేసుకుంటామన్నారు. 24గంటల కరెంట్ ఇస్తే చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారని, ఎన్ని గంటలు ఉండాలని, 24గంటలు ఉండాలనోళ్లు చేతులు లేపాలనడంతో ప్రజలు ఈలలు, కేరింతలతో, 24గంటలూ ఉండాలని గట్టిగా చెప్పారు. 3గంటల కరెంట్ చాలని, 10హెచ్‌పీ మోటర్ కావాలంటున్నారని విమర్శించారు.
దేశంలో ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లోనూ 24గంటల కరెంట్ ఇవ్వరన్నారు. రాహుల్, పీసీసీ అధ్యక్షుడు, భట్టి విక్రమార్కలు కాంగ్రెస్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నారని, ఏం నష్టం జరిగిందన్నారు. భూమి మీద హక్కు మారాలంటే మీ బొటన వేలు పెడితేనే సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రి వద్ద కూడా లేదని, ఆ హక్కు రైతులకే ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వస్తే పట్వారీలు, పహాణీ నకళ్లు, ఎంఆర్వో ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు తిరగాల్సి వస్తుందన్నారు. మళ్ల గిలాంటి రాజ్యమే రావాల్నా, ఒకరి భూములు ఒకరికి ఇచ్చి, రైతుల దగ్గర లంచాలు గుంజే దళారీల రాజ్యమే రావాల్నా.., ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్యన్నారు. ఆలోచించి ఓటెయ్యాలి, ఎవరో చెప్పిండ్రని ఓటేస్తే దళితబంధుకు జై భీమ్, రైతుబంధుకు రాం రాం అవుతుందన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో పాలమూరు ప్రాజెక్టుల పేర్లు పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ జిల్లాగా పేరు పెట్టారన్నారు. 30ఏండ్లు కల్వకుర్తి స్కీంను పండపెట్టారని ఆరోపించారు. ఇయ్యాల 3కోట్ల టన్నలు వడ్లు ఎలా వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లు అవుతుందన్నారు.
కడుపుల సల్ల కదలకుండ, ఇంట్లకెల్లి అడుగు బయటపెట్టకుండా నీళ్లు వస్తున్నాయన్నారు. పేగులు తెగేలా కొట్లాడి తెలంగాణ తెచ్చిందెవరు, ఇంట్లోకి నీళ్లు తెచ్చిందెవరో గుర్తించాలన్నారు. పదహారేండ్ల్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాడిగా ప్రజల మంచే కోరుకుంటున్నా. మర్రి జనార్దన్‌రెడ్డి గెలుపు ఖాయమే అయ్యిందని, భారీ మెజార్టీ వస్తుందన్నారు. గతంలో మార్కండేయ లిఫ్టు అడిగితే ఇచ్చామని, మూడు రోజులుగా నీళ్లు దుంకుతున్నయన్నారు. సొంత డబ్బుతో పెండ్లిళ్లు చేస్తున్నారని, డబ్బుల కోసం రాజకీయాలల్లో లేడన్నారు. నాగర్‌కర్నూల్ నిజాం జమనాలో జిల్లాఉండేనని, తెలంగాణ వచ్చాక జిల్లా అయ్యిందని, జీవకళ వచ్చిందని, పంటలు పండుతున్నాయని, నెల రోజుల్లో ఇంజినీరింగ్ కాలేజీ జీవో ఇస్తామని ప్రకటించారు. మంచిగ నడిచే తెలంగాణను మీరే కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలోఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ శాంతికుమారి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతరావు, మార్కెట్ చైర్మన్ స్వాతి మున్సిపల్ చైర్మన్ కల్పన, నాగం శశిధర్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.