గద్వాలటౌన్, డిసెంబర్ 24 : క్రిస్మస్.. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పర్వదినం. సోమవారం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా రెండు రోజుల ముందే పండుగ సందడి నెలకొన్నది. చర్చిలతోపాటు క్రైస్తవుల ఇండ్ల వద్ద క్రీస్తు జననానికి గుర్తుగా నక్షత్రాలను, క్రిస్మస్ ట్రీలను అందంగా అలంకరించారు. అలాగే జిల్లాలోని చర్చిలన్నింటినీ విద్యుద్దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆయా చర్చిల్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
క్రిస్మస్కు ముందు నుంచే క్రైస్తవులు తమ ఇండ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. క్రీస్తు జనానికి చిహ్నంగా నక్షత్ర ఆకృతిని భావిస్తారు. తూర్పు దేశాల జ్ఞానులకు గొల్లలకు దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతికి ప్రత్యేక చిహ్నంగా క్రైస్తవులు భావిస్తారు. నాటినుంచి నేటి వరకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్మస్ స్టార్‌ను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్ చెట్టును ప్యారడైజ్ ట్రీగా కూడా పిలుస్తారు. నిత్యం పచ్చగా ఉంటూ ప్రజలకు సుఖసంతోషాలను ట్రీ పంచుతుందని క్రైస్తవులు నమ్ముతారు.
క్రిస్మస్కు ముందు రోజు క్రైస్తవులు యేసుక్రీస్తును స్తుతిస్తూ అర్ధరాత్రి వరకు జాగరణ పాటిస్తారు. అంధకారంలో ఉన్న ప్రపంచాన్ని వెలుగులుతో నింపడానికి క్రీస్తు మర లా జన్మిస్తున్నారని చాటి చెప్తూ చర్చిల్లో, ఇండ్లల్లో కొవ్వొత్తులను వెలిగిస్తారు. నక్షత్ర రూపాల్లో ఉన్న సెట్టింగ్‌లు ఇండ్లపై ఎగురవేసిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
తాగ్యశీలి.. కరుణామయుడు అయిన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొనేందుకు సర్వం సిద్ధమయ్యింది. చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొనేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
క్రిస్మస్ రోజున చిన్నారులతో క్రిస్మస్ తాత వచ్చి సరదాగా ఆడుకుంటాడు. బొమ్మలు, చాక్లెట్లు ఇస్తాడని చిన్నారులు అతడి కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. క్రిస్మస్ తాత అంటే నికోలస్ అనే వ్యక్తి తల్లిదండ్రుల మరణాంతరం వారు సంపాదించిన ఆస్తులను పేదలకు పంచిపెట్టడానికి నిర్ణయించుకుంటాడు. తాను ఎవరో తెలియకుండా ఉండేందుకు బహుమతులు పంచే సమయంలో ఎర్రటి దుస్తులు, గుర్తు పట్టకుండా తెల్లటి గడ్డం, టోపీని ధరించాడు. అతడే శాంటక్లాజ్.. క్రిస్మస్ తాత.