మహబూబ్నగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ఎన్నికల కోడ్ కూసింది.. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎలక్షన్ నగారా మోగింది. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలై 10వ తేదీ వరకు కొనసాగనున్నది. 13న నామినేషన్ల పరిశీలన, 15వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తికి సన్నాహాలు చేపట్టారు. ఇది వరకే అన్ని చోట్ల ఓటర్ల తుది జాబితా ఖరారు కాగా.. ఈవీఎం మిషన్లు, ఇతరత్రా వాటిని కలెక్టర్లు తనిఖీ చేసి జాగ్రత్తగా భద్రపర్చుతున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని సమీకృత కలెక్టరేట్లలో, మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ పత్రాల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్లు హెచ్చరించారు. కాగా బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారు నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. కోడ్ అమల్లోకి వచ్చే వరకు విస్తృతంగా వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలు చేశారు. కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే ప్రతిపక్షాలు డీలా పడ్డాయి.. ఇంకా టికెట్లు ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలో నైరాశ్యం నెలకొన్నది.
ముఖ్యమైన తేదీలు