రాష్ట్ర సర్కారు ప్రయత్నం ఫలించింది. సాగునీటి సంకల్పం సిద్ధించింది. వాగుల పరీవాహక గ్రామాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. కరువు నేలన గంగమ్మతల్లి జలతోరణాన్ని తొడిగింది. దీంతో దేవరకద్ర జలసిరులను సంతరించుకున్నది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో నియోజకవర్గం పైర్లతో కళకళలాడుతున్నది. ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు బండర్‌వల్లి, ఊకచెట్టు, కందూరు వాగులపై 21 చెక్‌డ్యాంలు నిర్మించారు. నేడు జలకళను సంతరించుకొని సత్ఫలితాలన్నిస్తున్నాయి. పెద్దరాజమూరు, చిన్నరాజమూరు, బస్వాపూర్, గూరకొండ (బండర్‌వల్లి), లాల్కోట, ముసాపేట మండలం నిజాలాపూర్ చెక్‌డ్యాంలు అలుగు దుంకుతున్నాయి. మరో 15 చోట్ల నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రతి అడ్డుకట్ట వద్ద సుమారు 2 కి.మీ. మేర జలదృశ్యం సాక్షాత్కరిస్తున్నది. స్థానికులు సెల్ఫీలు దిగుతూ, ఈత కొడుతూ సందడి చేస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా తక్కువ ఖర్చుతోనే 25 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఆలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.
– మహబూబ్‌నగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్షపు నీరు వృథా కాకుండా వాగులపై ఎక్కడికక్కడ నిర్మించిన చెక్‌డ్యాంలు నేడు సత్ఫలితాలనిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నిర్మించిన చెక్‌డ్యాంల వల్ల వందలాది ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. గతంలో వరద వచ్చినా ఆ నీటితో సాగుచేసుకోలేక రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితి. తోటి రైతులతో మాట్లాడుకొని వందల మీటర్ల మేర పైప్‌లైన్ వేసుకుని వాగుల్లో బోరు మోటర్లు దింపి పంటలకు నీళ్లు పారించుకునేవారు.
తెలంగాణ వచ్చినంక ప్రభుత్వం సాగునీటిపై దృష్టిపెట్టింది. వర్షాలు కురిసినప్పుడు వాగులు, వంకల్లో వరద వృథా కాకుండా చెక్‌డ్యాంలు నిర్మించడంతో నేడు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి జలదృశ్యం ఆవిష్కృతమవుతున్నది. దీంతో వాగులు, చెరువు పరిసర ప్రాంతాల్లో కనుచూపు మేర పచ్చదనం పరుచుకున్నది. భూగర్బ జలాలు పెరిగి బోర్లన్నీ రీచార్జ్ కావడంతో అన్నదాతలు ఆనందంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. వాగుల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆశ్చర్యకరంగా ఎండిపోయిన బావుల్లో జలం ఉబికి వస్తున్నది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మించిన చెక్‌డ్యాంలు నేడు జలకళను సంతరించుకున్నాయి. చిన్నపాటి వర్షాలకే చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నాయి.
దేవరకద్ర నియెజకవర్గంలో మొత్తం 21 చెక్‌డ్యాంలు బండ్రవల్లి వాగు, ఊకచెట్టువాగు, కందూరు వాగులపై నిర్మించారు. వీటి వల్ల నియెజకవర్గంలో కొత్తగా 20వేల ఎకరాల ఆయకట్టుకు ఊతం లభించింది. రూ.77కోట్లతో మరో తొమ్మిది చెక్‌డ్యాంలను మంజూరు చేయించుకోగా త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చెక్‌డ్యాంల వల్ల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా భుగర్భజలాలు కూడా పెరిగాయని, తాగు, సాగునీటికి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 22 అడుగులకు చేరి నిండుకుండను తలపిస్తున్నది. మరో వారంలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిండితే దేవరకద్ర నియోజకవర్గంలో సాగునీటికి ఢోకా ఉండదని అంటున్నారు.
అలుగు పారుతున్న చెక్‌డ్యాంలు..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియెజకవర్గంలో వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్నాయి. దేవరకద్ర మండలంలోని బండ్రవల్లి వాగు జలకళను సంతరించుకున్నది. ఫలితంగా పెద్దరాజమూరు, చిన్నరాజమూరు, బస్వాపూర్, గురకొండ (బండ్రవల్లి), లాల్కోట, ముసాపేట మండలం నిజలాపూర్ చెక్‌డ్యాంలు కూడా అలుగు దుంకుతున్నాయి. మరో 15 చెక్‌డ్యాంలు నిండుకుండలా మారాయి. ప్రతి చెక్‌డ్యాం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర నీరు నిలిచిన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. బండ్రవల్లి వద్ద ఆర్అండ్బీ రహదారిపై నిర్మించిన చెక్‌డ్యాం జలపాతాన్ని తలపిస్తుండడంతో అటుగా వెళ్తున్న వారంతా సెల్ఫీలు దిగుతూ సందడిగా గడుపుతున్నారు. సుమారు రూ.60లక్షలతో పాత బ్రిడ్జిని మూసివేసి చెక్‌డ్యాంగా మార్చారు. దీంతో ఏడాది పొడవునా నీరు నిలిచి ఆరు గ్రామాలకు సాగు, తాగునీరు అందుతున్నది.
నిండుకుండలా కోయిల్‌సాగర్..
దేవరకద్ర నియోజకవకర్గ వరప్రదాయిని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తున్నది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 32 అడుగులు కాగా ప్రస్తు తం 22 అడుగులకు చేరింది. 15 రోజుల కిందట జూ రాల నుంచి నీళ్లను ఎత్తిపోశారు. తీలేరు పంప్‌హౌస్ నుంచి వారం పాటు ఒక మోటర్తో రోజుకు సుమారు 312 క్యూసెక్కులను కోయిల్‌సాగర్‌కు పంపింగ్ చేశారు. అంకిళ్ల వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో అధికారులు పంపింగ్‌ను నిలిపివేశారు. 10 అడుగుల మేర నీళ్లు వస్తే గేట్లు ఎత్తివేయనున్నారు. దీం తో శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి మొదలవనున్నది. కోయిల్‌సాగర్ పూర్తిస్థాయిలో నిండితే రెండు పంటలు పండించుకోవచ్చని అన్నదాతలు అంటున్నా రు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడంతో తాగు, సాగునీటికి ఢోకా ఉండదని అధికారులు అంటున్నారు.
‘ఆల’ను ప్రశంసించిన సీఎం కేసీఆర్
దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల పట్టుబట్టి నిర్మించిన చెక్‌డ్యాంల వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరిందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఇటీవల ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన సందర్భంలో రాష్ట్రంలో కురుస్తున్న వానలు, అలుగు పారుతున్న చెరువులు, చెక్‌డ్యాంల ప్రస్తావన వచ్చింది. ఎమ్మెల్యే ఆల తన నియోజకవకర్గంలో పట్టుబట్టి చెక్‌డ్యాంలు నిర్మించుకోగా నేడు అవి అలుగు పారుతున్నాయని ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో సుమారు 20వేల ఆయకట్టు అదనంగా సాగవుతున్నదని, ఇదంతా ఆల కృషేనని కొనియాడారు.
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూర్, జూలై 25 : గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లకు నీటి తరలింపు యథావిధిగా కొనసాగుతున్నదని ఈఈ రహీముద్దీన్ మంగళవారం తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టినా, ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నందునా పంపింగ్ కొనసాగుతుందన్నారు. ఎగువ నుంచి వరద పెరిగితే రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుని సాగునీటిని విడుదల
చేస్తామన్నారు.
దుందుభీ పరవళ్లు
మిడ్జిల్, జూలై 25 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మిడ్జిల్ మండలంలోని దుందుభీ వాగు దోనూర్, వల్లబురావుపల్లి, మున్ననూర్, కొత్తూర్ గ్రామాల మీదుగా ప్రవహిస్తున్నది. వాగులోని చెక్‌డ్యాంలు అలుగు పారుతుండడంతో రైతులు ఆ నందం వ్యక్తం చేస్తున్నారు. మిడ్జిల్ మండలంలో వారం నుంచి వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. మొక్కజొన్న, పత్తి పం టలు కొంతమేర నీట మునిగాయి. భూగర్భజలా లు పెరిగి పంటలు పండుతాయని చెక్ డ్యాం కింద సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైల జలాశయానికి ఇన్‌ఫ్లో నిల్
శ్రీశైలం, జూలై 25: శ్రీశైల జలాశయానికి వరద నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రానికి జలాశయంలో నీటి నిల్వ 814 అడుగులకు చేరింది. కాగా ఏపీ పవర్‌హౌస్, టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. జలాశయం పూర్తిస్థాయి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 814 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.00 టీఎంసీలు ఉన్నాయి.
జూరాలకు స్వల్పంగా వరద
అమరచింత, జూలై 25 : ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా మంగళవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డ్యాం సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా నెట్టంపాడు ప్రాజెక్టుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 1,300, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
కొనసాగుతున్న పంపింగ్
మక్తల్ టౌన్, జూలై 25 : కృష్ణానదికి వస్తున్న వరదతో రిజర్వాయర్లను నింపాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు పంపింగ్ కొనసాగిస్తున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమా ఫేజ్-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయర్లకు భీమా చిన్న గోప్లాపూర్ స్టేజ్-1 పంప్ హౌస్ నుంచి ఒక మోటర్తో 650 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు. మక్తల్ తిరుమలయ్య చెరువుకట్ట వద్ద ఉన్న స్టేజ్-2 పంప్ హౌస్ నుంచి 400 క్యూసెక్కుల నీటిని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సంగంబండ రిజర్వాయర్‌లో 3.3173 టీఎంసీలకు గానూ 1.4 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భూత్పూర్ రిజర్వాయర్‌కు 250 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్‌లో 1.313 టీఎంసీలకు గానూ 0.15 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. కృష్ణానదికి వరద వస్తున్న క్రమంలో పంపింగ్ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.
ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద
అయిజ, జూలై 25 : మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 1,16,263 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 8,857 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా ప్రస్తుతం 1,692.55 అడుగులకు చేరింది. 129.72 టీఎంసీల సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 74.22 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 13,681 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 50 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగులు కాగా 1,600.69 అడుగుల నిల్వ ఉన్నది. 37.640 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 20.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో..
కర్ణాటకలోని తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. మం గళవారం ఇన్‌ఫ్లో 66,250 క్యూసెక్కులు ఉండగా, అవు ట్ ఫ్లో 205 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 105.788 కాగా ప్రస్తుతం 31. 658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1,633 అడుగులకు గానూ ప్రస్తుతం 1,606.78 అడుగులకు చేరుకున్నది.
సీఎం ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది..
నియోజకవర్గంలో మూడు దిక్కులా వాగులు ఉన్నాయి. వీటి నుంచి ఏటా వరద వృథాగా పోతున్నది. భారీ వర్షాలు కురిసినప్పుడు నిండుగా పారుతున్న వాగును చూసి మురిసిపోవడం తప్పా పంటకు వినియోగించుకోలేక పోయేవారు. నిండుగా పారిన వాగులు కండ్లముందే అడుగంటి పోయి సాగునీటికి ఇబ్బంది పడేవారు. అందుకే చెక్‌డ్యాంలను నిర్మించాం. దీంతో నీటిని నిలుపుకొని పరిసర భూములకు సాగునీటిని అందిస్తున్నాం. భూగర్భ జలాలు కూడా పెరిగి రెండు పంటలు పండించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైంది. అడిగిన వెంటనే 30 చెక్‌డ్యాంలు మంజూరు చేసి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర