కొల్లాపూర్, సెప్టెంబర్ 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్‌లో జరుగనున్న భారీ బహిరంగసభకు జనాన్ని భారీగా సమీకరించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగసభకు సుమారు 500 ఆర్టీసీ బస్సులను బుక్ చేశామన్నారు. జనసమీకరణను నాయకులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అందరి లక్ష్యం కొల్లాపూర్ సభను విజయవంతం చేయడమేనని స్పష్టం చేశారు. మనకున్న గౌరవం, శక్తిని ఉపయోగించి సభకు ప్రతి గ్రామం నుంచి భారీగా జనాన్ని తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో కొల్లాపూర్ నియోజకవర్గం రూపురేఖలు మరింత మారనున్నాయన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పీఆర్ఎల్ఐ బాధిత కుడికిళ్ల రైతులకు న్యాయం కోసం పోరాడానని, ఆనాడు ఆ పెద్దమనిషి పట్టించుకోలేదని విమర్శించారు. పీఆర్ఎల్ఐ నుంచి కేఎల్ఐ ఎల్లూర్ రిజర్వాయర్‌కు నీటి కోసం స్లూయిస్ ఏర్పాటు చేయాలని సూచించిన మేరకు అడుగులు పడుతున్నాయని వివరించారు. అనంతరం ఈదమ్మ బావి వద్ద సభాస్థలాన్ని పరిశీలించారు.
పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీది కాదా?
బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీది కాదా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత రంగినేని అభిలాష్‌రావు పైర్ అయ్యారు. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాన్ని గులాబీ పార్టీ అభ్యర్థిగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కేటాయిస్తే, హస్తం పార్టీకి ద్రోహం చేసి విమానం గుర్తుపై పోటీచేసింది నీవు కాదా జూపల్లి? అని ప్రశ్నించారు. ఇది ఆనాడు కాంగ్రెస్‌కు నీవు చేసిన ద్రోహం కాదా అని గుర్తు చేశారు. టీఆర్ఎస్లోనే ఉంటూ కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై రెబల్ అభ్యర్థులుగా పోటీలో పెట్టి, సొంత పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీది కాదా? అని ప్రశ్నించారు. రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే ఆరాధ్యదైవం అని మాట్లాడిన జూపల్లికి అప్పుడే విరక్తి వచ్చిందా అని ఎద్దేవా చేశారు. సీఎం సభకు జన సమీకరణ కోసం ఆటోలకు మైక్‌లు పెట్టి పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వీపనగండ్ల, పాన్‌గల్, కోడేరు ఎంపీపీలు, జెడ్పీ కోఆప్షన్‌సభ్యులు, గొర్రెల కాపరుల సహకారసంఘం జిల్లా అధ్యక్షుడు గాలియాదవ్, సింగిల్‌విండో చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.