మాగనూరు (కృష్ణ) : నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దులోని కృష్ణ బోర్డర్ చెక్‌పోస్ట్( Krishna Border ) వద్ద జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్( SP Vineet) ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, మొత్తం 65 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు జాగిలాలతో దాదాపు ఆరు గంటల పాటు 367 వాహనాలు తనిఖీ చేశారు.

జిల్లా ఇతర రాష్ట్రాల సరిహద్దులు కలిగి ఉండడం వల్ల తెలంగాణలోకి వచ్చే నిషేదించ బడిన డ్రగ్స్( Drugs ) , గంజాయి ( Ganja) , గుట్కా, ఇసుక( Sand) , అక్రమ మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక తనిఖీలు చేసినట్లు వివరించారు. అక్రమ వ్యాపారాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు , దొంగతనాల నివారణకు, నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు రెండు వరి ధాన్యంతో వస్తున్న లారీలు, ఒక ఇసుక లారీ, 200 లీటర్ల డీజిల్‌ను పట్టుకొని వారి పై కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పహారాను మరింత బలోపేతం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, ఎస్సై లు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.