‘ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు’.. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు కష్టపడాల్సి వస్తున్నది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు హెల్త్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి చిన్న వయస్సులోనే రోగాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మేలని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకోసం నడక ఎంతో మంచిదని భావించి ఉదయం అరగంట.. సాయంత్రం అరగంట వాకింగ్ చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కొంత దూరం నడకతో అలసట దూరమవుతున్నది. ప్రజల్లో ఉత్సాహం పెరుగుతున్నది. పట్టణాల నుంచి మెల్లమెల్లగా పల్లెలకూ పాకింది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామంతోపాటు ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారు.
బాలానగర్/మిడ్జిల్, నవంబర్ 26 : ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్న వయసులోనే రోగాల బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఆయష్షు పెరగాలన్నా.. నడక ఎంతో మేలు. ఆరోగ్యంగా ఉండాలంటే నడకతోపాటు తేలికపాటి వ్యాయాయం, ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి. సమయాన్ని వృథా చేసే బదులు అరగంట నడిస్తే చాలు.. చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
వాకింగ్ మొదలుపెట్టిన రోజే గంటలు, గంటలు నడవకుండా.. శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా.. ముందు పావు గంట నడవాలి. ఆ తర్వాత అరగంట.. ఆపైన పెంచుతూపోవాలి. మొదటి అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఇలా వారంపాటు ప్రతి రోజూ నడిస్తే 1,500 కేలరీల వరకు ఖర్చు అవుతుందంటున్నారు. అయితే, ఒకసారి వాకింగ్ మొదలుపెట్టాక మధ్యలో ఆపకుండా కొనసాగించడం మంచిది. అప్పుడే సరైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు. బరువు త్వరగా తగ్గాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వేగంగా వాకింగ్ చేస్తుంటారు.
అలాంటి వారు ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కఠినమైన నియమాలు పెట్టుకొని వాకింగ్ చేస్తున్నా.. తిండి కంట్రోల్ చేయకపోతే అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. అవసరం లేకపోయినా అదే పనిగా ఏదో ఒకటి తింటూ ఉండడం కూడా మంచిది కాదు. జంక్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు ఎంత వాకింగ్ చేసినా బరువు తగ్గరు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అవుతుంది. బరుగు తగ్గాలకునే వారు రోజుకు అరగంటపాటు నడిస్తే రెండు నెలల్లో కాస్త కంట్రోల్లోకి వస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే, తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి.
కొంతమంది వారం, రెండు వారాలు నడిచి ఇంకా బరువు తగ్గడం లేదని నిరాశతో వాకింగ్ చేయడం మానేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఓపికతో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తుండాలి. తర్వాత మనం అనుకున్న ఫలితం ఉంటుంది.అంతేకాకుండా నిత్యం క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. గుండె జబ్బులున్న వారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అనారోగ్యం దరిచేరదు..
పరుగు ద్వారా ఒంట్లోని కొవ్వంతా కరుగుతుంది. నేడు మారుతున్న జీవన శైలిలో యువకుల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం ఎంతో అవసరం. మిత్రులతో మంచి, చెడు పంచుకుంటూ వ్యాయమం చేస్తే అనారోగ్యం దరిచేరదు. క్రీడాకారులమంతా క్రమం తప్పకుండా ఫిట్నెస్ కోసం వ్యాయమం చేస్తున్నాం. క్రీడలు, ఉద్యోగ సమాచారం చర్చించుకుంటూ ముందుకు సాగుతాం.
– వరుణ్‌రాజ్, మిడ్జిల్
నడకతోనే ఆరోగ్యంగా ఉన్నా..పదేండ్లుగా వాకింగ్ చేస్తున్నాను. చలికాలంలో వాకింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉండగలం. ఉదయం పూట పది మందితో కలిసి నడుస్తాను. మండలంలోని పెద్దాయపల్లి క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తాం. ఇక్కడ రోడ్డు విశాలంగా ఉండడంతోపాటు పచ్చని చెట్లు ఉన్నాయి. మంచి గాలి వస్తుంది. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే నడకే మంచిది.
– మంజూనాయక్, డేగావత్ తండా,బాలానగర్ మండలం
మెదడు చురుగ్గా ఉంటుంది
కొన్నేండ్లుగా వ్యాయమం చేస్తున్నా. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజువారీ నడక చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే స్వచ్ఛమైన గాలి లభించి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. దీంతో రోజంతా మెద డు చురుగ్గా పనిచేస్తుంది. ఉద యం గంటపాటు వ్యాయమం చేయడంతో ఉల్లాసంగా ఉంటుంది. అలసట దరిచేరదు. నిత్యం ఉత్సాహంగా పనులు చేసుకుంటాం.
– రామకృష్ణ, మిడ్జిల్