మహబూబ్‌నగర్ కలెక్టరేట్, నవంబర్ 23 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీ (ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల)లో రూ.2కోట్లతో ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నూతనంగా నిర్మించనున్న జీప్లస్-1 భవన నిర్మాణానికి కళాశాల ఆవరణలోని పాత ల్యాబ్‌లకు సమీపంలో ప్రత్యేక స్థలాన్ని బాయ్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి కేటాయించారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఆధునిక సౌకర్యాలతో నిర్మించే సైన్స్ ల్యాబ్‌లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కళాశాల ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీ కొంత తొలగించి చదును చేశారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ మొత్తం 4 ల్యాబ్‌లు ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయడంతో పాటు 4 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. కలెక్టర్ విజయేందిరబోయి ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ భగవంతాచారి తెలిపారు. బాయ్స్ జూనియర్ కళాశాల భవనానికి వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్నదని, నిజాం నవాబులు ఈ భవనాన్ని నిర్మించారని, కాలక్రమేనా 1948లో మల్టీపర్పస్ హైస్కూల్ కోసం ఈ భవనాన్ని కేటాయించినట్లు అధ్యాపకులు తెలిపారు. 1969-70 అకాడమిక్ ఇయర్లో మహబూబ్‌నగర్‌కు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మంజూరు కావడంతో అప్పట్నుంచి ఇక్కడ కళాశాల కొనసాగిస్తున్నారు.
విద్యార్థులకు సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణంతో ఎన్నో ఉపయోగాలు కలుగనున్నాయి. ఆధునిక సౌకర్యాలతో శాస్త్రీయ విషయాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. వినూత్న పద్ధతులను ప్రయత్నించవచ్చు. సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను కనుగొనవచ్చు. ల్యాబ్‌లో జరిగే ప్రయోగాలు, పరిశీలనల ద్వారా శాస్త్రీయ వాస్తవాలను, సిద్ధాంతాలను సులభంగా అర్థం చేసుగలుగుతారు. అదనపు తరగతి గదులతో సువిశాలమైన గదుల్లో విద్యాబోధన మరింత సులభతరం కానున్నది.
– భగవంతాచారి, ప్రభుత్వ బాయ్స్ కాలేజీ ప్రిన్సిపాల్, మహబూబ్‌నగర్