అచ్చంపేట రూరల్: తెలంగాణ రైతులకు యూరియా బస్తాలు( Urea )అందించడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని సీపీఎం ( CPM) జిల్లాకార్యదర్శి వర్ధం పర్వతాలు ఆరోపించారు. యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అచ్చంపేట సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఎరువులు, యూరియా బస్తాల కోట తగ్గించి రైతులను ఇబ్బందికి గురి చేస్తుందని పేర్కొన్నారు. పండించిన పంటలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నెలల తరబడి నిర్లక్ష్యం చేయగా నేడు ఎరువుల కొరతతో రైతులను ఇబ్బందులపాలు చేస్తుందని మండిపడ్డారు. రైతన్నలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గాడి తప్పిందన్నారు.
సమయానికి పంట పొలాలకు ఎరువులు యూరియా వెయ్యకపోతే రైతులకు తీవ్రనష్టాలు వస్తాయని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఎరువులు, యూరియా, విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ నాయక్, సీనియర్ నాయకులు శివకుమార్, ఎం దశరథo, సీపీఎం మండల కార్యదర్శి వర్ధo సైదులు, రాములు తదితరులు పాల్గొన్నారు.