బిజినేపల్లి, ఫిబ్రవరి 9 : కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పాలెం వేంకటేశ్వరస్వామి విరాజిల్లుతున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తిరుపతికి వెళ్లలేని పేదలు ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకుంటారు. గ్రామ నిర్మాత దివంగత తోటపల్లి సుబ్రమణ్యశర్మ ప్రోద్బలంతో అతని సన్నిహితులైన రామలింగయ్య, బాల్లింగయ్యలు 13 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. గ్రామంలో ప్రధాన రహదారికి సమీపంలోనే ఉన్న ఆలయంలో మూల విరాట్ విగ్రహాన్ని 1962లో తిరుమల పాపనాశిని వద్ద, అలివేలు మంగ అమ్మవారి విగ్రహాన్ని రాయచోటిలో తయారు చేయించి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ వేడుకకు నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఇక్కడ ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా 11 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన కల్యాణం, రథోత్సవం వైభవంగా జరిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వారి సౌకర్యార్థం ఈవో రంగారావు, మాజీ చైర్మన్ శేఖర్‌రెడ్డి చర్యలు చేపట్టారు.
11 నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11న అభిషేకాలు, భాగవత పద్యపటన పోటీలు, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, 12న హోమ బలిహరణం, ధ్వజారోహణం, హోమం, బలిహరణ, భేరిపూజ, 13న ప్రభంద పారాయణం, హోమ బలిహరణ, లక్ష పుష్పార్చన, సుప్రభాత పోటీలు, ఎదుర్కోళ్లు, 14న ప్రబంధ పారాయణం, హోమ బలిహరణ, అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం, గజవాహన సేవ, 15న ప్రభంజ పారాయణం, నివేదన, ఉమ్మడి జిల్లాస్థాయి భజన పోటీలు, పల్లకీసేవ, 16న నిత్యారాధన, రథోత్సవం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, 17న నిత్యారాధన, ఉద్దాల మహోత్సవం, అశ్వవాహనసేవ, 18న నిత్యారాధన, హోమం పూర్ణాహతి, బలిహరణ, చక్రస్నానం, వివిధ పోటీలు, శేషవాహనసేవ, పండితులకు సన్మానం ఉంటుంది.