కల్వకుర్తి, మే 31 : కల్వకుర్తి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరుస్తున్న పశువుల సంత వేలం మరోసారి వాయిదా పడింది. శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ మహమూద్ షేక్ ఆధ్వర్యంలో పశువుల సంతకు వేలం నిర్వహించారు. పాల్గొన్న గుత్త్తేదారులు టెండర్ ధర చూసి చేతులెత్తేశారు. ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏమాత్రం గిట్టుబాటు కాదని, ఈ ధరకు టెండర్ తీసుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని గుత్తేదారులు చెప్పారు.
పశువుల సంత 2024-25 సంవత్సరంలో 9నెలల కాలానికి (జూన్ నుంచి మార్చి 31 వరకు) దాదాపు రూ.87లక్షలకు గుత్తేదారు టెండర్ దక్కించుకున్నారు. 2025-26 సంవత్సరానికి పశువుల సంత టెండర్‌కు మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్ ధరను రూ.1.27కోట్లకు నిర్ణయిస్తూ వేలం నిర్వహించారు. టెండర్ ధర గిట్టుబాటు కాదంటూ టెండర్‌దారులు నిరాసక్తత చూపించారు. టెండర్ కాకపోవడంతో మరో రెండు సార్లు అవే డీడీలపై టెండర్‌దారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశమయ్యారు. చివరకు టెండర్ ధర రూ.1.17కోట్లుగా నిర్ణయిస్తూ వేలం పాట నిర్వహించినా టెండర్‌దారులు సంత నిర్వహణకు ముందుకు కాలేదు.
పశువుల సంతకు టెండర్ లేకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు తమ సిబ్బందితో రెండు నెలలుగా సంతను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్, మే నెల(రెండు నెలలు 10వారాలు)లుగా సిబ్బంది ఆదివారం పశువుల సంతను జరుపుతున్నారు. అధికారులు నిర్వహిస్తున్న పశువుల సంతలో పశువు క్రయ, విక్రయానికి రూ.750 వసూలు చేస్తున్నారు. దీంతో సరాసరిన నెలకు రూ.6లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కమిషనర్‌ను అడగాలని యత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు.