మరికల్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ( Caste census ) తప్పుల తడకగా ఉందని, బీసీలను తగ్గించి చూపించిందని బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండు యాదవ్ ( Pandu Yadav ) డిమాండ్ చేశారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కుల గణన, జనగణన తప్పులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన కేంద్రం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు సమర్థించడం లేదని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, కులాల వారిగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గించాలని, బీసీ రిజర్వేషన్లను పెంచాలని కోరారు.
బీసీ కులాల నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి అధిక స్థానాల్లో విజయకేతనం ఎగరవేయాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కులాల వారిగా రిజర్వేషన్ ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ కులాల ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, ఉపాధ్యక్షులు విజయ మహేంద్రా, జిల్లా నాయకులు విజయకుమార్, నరసింహ యాదవ్ రాజు, లింగప్ప, వెంకటన్న నరేష్,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.