మరికల్ : పెద్ద ధన్వాడలో (Pedda Dhanwada ) ఇథనల్ కంపెనీకి (Ethanol Company ) వ్యతిరేకంగా పోరాడిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చిత్తనూర్ ఇత్తనల్ కంపెనీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు పెద్ద ధన్వాడ, ఇటు చిత్తనూరు ఇథనల్ కంపెనీలను రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇథనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన రైతులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.
ప్రజాపోరాటాలతోనే స్తంభంపల్లి (జగిత్యాల జిల్లా), దిలావర్ పూర్ (నిర్మల్ జిల్లా) ఇథనాల్ కంపెనీలు రద్దు అయ్యాయన్న విషయాన్ని రైతులు గుర్తు చేసుకోవాలని సూచించారు. సభ్యులు, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. చక్రవర్తి, పాలమూరు అధ్యయన వేదిక నాయకులు ఎం వెంకట రాములు , ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ , మన్యంకొండ జిల్లా అధ్యక్షుడు పృథ్వి, రైతు మండలి నాయకులు రామచంద్రయ్య, మల్లేష్, మధు, ఎస్ లక్ష్మయ్య అలీసాబ్, శ్రీను పాల్గొన్నారు.