పాన్‌గల్ ఖిల్లా.. ప్రకృతి రమణీయ దృశ్యాల నెలవు.. ఆ కొండ మీది కోట కాకతీయుల కళాత్మకతకు దర్పణం.. రమణీయ శిల్పకళా సంపదకు కొలువు.. చెక్కు చెదరని ప్రధాన ద్వారం.. శత్రుదుర్భేద్యకరంగా కోట గోడలు.. యుద్ధానికి సై అనేలా ఫిరంగి.. వేసవిలోనూ పుష్కలంగా నీరుండే రామగుండం.. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో నిర్మాణం.. వెరసి ఇదొక చారిత్రక స్వర్గసీమ.. వనపర్తి జిల్లాలో కనువిందు చేసే చారిత్రక రహస్యాన్ని ఈ ఖిల్లా దాచుకున్నదట. 1540లో నిర్మించిన కట్టడం నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. అంతటి ప్రాశస్త్యం ఉన్న నిర్మాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇప్పటికే టూరిజం, పురావస్తు శాఖాధికారులు ఖిల్లాను సందర్శించి పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించారు.
– పాన్‌గల్, జూలై 29
పాన్‌గల్, జూలై 29 : వనపర్తి జిల్లాలో కొలువైన పాన్‌గల్ ఖిల్లా పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది గట్లు. దాని మీదుగా నిత్యం ప్రయాణించే బాటసారులకు అదో సాధారణ గుట్ట మాత్రమే! అందుకే దాని ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఆ చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియదు. ఆ గట్ల వెనుక ఉన్న బాలపీర్లను దర్శించుకునే ప్రజలు ఈ ఖిల్లాను దర్శించుకున్న దాఖలాల్లేవ్. ఇది కొంచెం ఆశ్చర్యమే! కండ్లముందు కనిపిస్తూనే కడుపులో బోలెడంత చారిత్రాత్మక రహస్యాన్ని దాచుకున్న బర్లగట్టు ఉరఫ్ ఖిల్లాగట్టు ఉరఫ్ పాన్‌గల్ గట్టు గుట్టు విప్పే కథనం ఇది.. చుట్టూ నాలుగు పెద్ద దుర్గాలు.. ఆ దుర్గాల మధ్య మైదానం. నవాబులు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న కోటలు, ఇక్కడ విస్తరించిన పచ్చిక, పెద్దపెద్ద చెట్లు, గుట్టలు, కాలుష్యం లేకుండా వీచే చల్లటి గాలి సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. గుట్టపైకి ఎక్కి చూస్తే నలుదిక్కులా ఊళ్లు అగుపిస్తాయి. పాములా పాకిపోతున్నట్లు రహదారుల ఆకారం కనిపిస్తుంది. కోనేరులోని చల్లటి నీరు దాహార్తిని తీర్చడమే కాదు స్వస్థతనూ చేకూరుస్తుంది. కారణం అందులో వనమూలికలుండడం. కాళ్లకు కాసింత పనిచెప్పే తీర్థయాత్ర పూర్తి చేసి ఇక్కడికి వస్తే మనసు కుదుటపడిందనే అనుభూతి కలుగుతుంది. ఈ చారిత్రక సంపద కోసం ఒకప్పుడు యుద్ధాలు కూడా జరిగాయి అనడానికి ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులను కూడా చూడొచ్చు.
శిల్పసంపద, పూజించుకునేందుకు దేవుళ్లు, శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల కోటలు ఇవన్నీ గతవైభవ దీప్తులే! మిగిలిన చారిత్రక సంపదలే! చనిపోయిన వారిని ఖననం చేసిన శ్మశానం కూడా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్ల గవిని అనే ప్రధాన ద్వారం నేటికీ దర్జాగా నిలబడి ఉంది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లను ఉపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులున్నాయి. ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1,800 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నది. శిలాశాసనాలు ఈ ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూలిపిలో ఓ శాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది భైరాన్ఖాన్ మూడో శాసనమని అర్థమవుతున్నది. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. స్వస్తిశ్రీ జయభ్యుదయ శాలివాహన వర్షంబులు 1540 అగుననేడి చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా వారి సుభేదారుడు భైరాన్ఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించారు. ఇక్కడి శిల్పాలపై ఏనుగు, నెమళ్ల చిత్రాలు చెక్కి ఉన్నాయి. శ్రీ.శ 1604లో రాజమాత నివసించేందుకు వీలుగా భవంతిని నిర్మించినట్లు తెలుస్తున్నది. 1786లో నైజాం వంశీయులైన నిజాం ఆలీఖాన్ బహుదూర్కోటలో కొంత కాలం నివసించినట్లు తెలుస్తున్నది. అలంపూర్, జటప్రోలు, నందివడ్డెమాన్, కోయిలకొండ, ఖిల్లా ఘణపురం మాదిరిగానే ఇక్కడ కూడా నవాబులు వైభవంగా పాలించారు.
రామగుండం ఖిల్లాలో పడమటి దిశగా ఒక పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాములవారి పాదాలను చెక్కారు. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి రామగుండంలో స్నానాలు చేసి సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటారు. యుద్ధాలు ఇక్కడ రెండుసార్లు జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహుమని సుల్తాన్, కులీకుతుబ్‌షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి శ్రీ.శ 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్‌షా ఓడిపోయినట్లు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలమయ్యాయి. ఈ ఖిల్లాపై లభించిన చిన్న ఫిరంగులను నాగర్‌కర్నూల్, గోపాల్పేట, వనపర్తి, పాన్‌గల్ పోలీస్స్టేషన్లలో ఉంచారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు, రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతూనే ఉన్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి. పడమటి వైపున ఓ ఫిరంగిని కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగపై దాడిచేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గుర్తులున్నాయి. ఆ మధ్యకాలంలో పేరెన్నికగన్న పాన్‌గల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ ఖిల్లానే వేదికగా చేసుకున్నాడు.
చరిత్రలో గుర్తుకొచ్చే బాలనాగమ్మ కథకు.. ఈ దుర్గానికి సంబంధం ఉందని నేటికీ చెబుతుంటారు. మాయల ఫకీర బాలనాగమ్మ కథలో వీధి నాటకాల్లో పాన్‌గల్ ఖిల్లా ప్రస్తావన ఉంది. ఈ కథతోపాటు ఈ ప్రాంతాన్ని గడగడలాడించిన మియ్యాసావ్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించే వాడని మాయాసాబ్ చరిత్ర చెబుతోంది. మియ్యాసావ్ వంశీయులు ఖిల్లా దుర్గానికి కూతవేటు దూరంలో చరిత్ర కలిగిన బారా సాహిద్ దర్గాకు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ముస్లింలకు ఆరాధ్యదైవం ఆకర్షబ్ దర్గా ఈ కోటలోనిదే. ప్రతి ఏడాది పాన్‌గల్ నుంచి దర్గాకు గంధోత్సవం నిర్వహిస్తుంటారు. నాటి ముస్లిం రాజులు ప్రార్థన కోసం ఖిల్లా దుర్గంలో నిర్మించిన మక్కామసీదు ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.
ఎంతో చరిత్ర కలిగిన పాన్‌గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. టూరిజం, పురావస్తు శాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఖిల్లాను సందర్శించి శిథిలమవుతున్న చారిత్రక కట్టడాలను పరిశీలించి పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రస్తుతం సందర్శకుల కోసం జెడ్పీ కోఆప్షన్ నిధుల నుంచి కొంతమేర బాట సౌకర్యం కల్పించారు. దుర్గంపైకి వెళ్లేందుకు మెటల్‌రోడ్డు, విద్యుత్ సౌకర్యం కోసం సుమారు రూ.కోటితో ఎస్టిమేషన్ చేసి ప్రభుత్వానికి నివేదించారు. తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేశారు. పాన్‌గల్ నుంచి రామగుండం వరకు సుమారుగా రూ.50లక్షలతో సీసీమెట్ల ఏర్పాటు కోసం నివేదిక సిద్ధం చేశారు.