తిమ్మాజిపేట, సెప్టెంబర్ 14 : సతీమణిని కోల్పొయి పుట్టేడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మండలంలోని ఆవంచలోని ఆయన స్వగృహానికి శనివారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో చేరుకొన్న ఆయన లక్ష్మారెడ్డిని ఓదార్చారు. శ్వేతారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన్ను హత్తుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. మృధుస్వభావి లక్ష్మారెడ్డికి భార్య వియోగం బాధాకరమన్నారు.
లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, కుమారుడు, కుమార్తెతో మాట్లాడారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్, అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బాల్కసుమన్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గణేశ్‌గుప్తా వచ్చి పరామర్శించారు. అంతకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డితోపాటు జడ్చర్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి సంతాపం తెలియజేశారు.